పీజీఆర్ఎస్ అర్జీలను వేగంగా పరిష్కరించాలి: ఎస్పీ బి.ఉమామహేశ్వర్
కుటుంబ వివాదాల్లో కౌన్సెలింగ్‌కు సఖీ వన్‌స్టాప్ సెంటర్ సేవలు వినియోగించాలి
బాపట్ల, సెప్టెంబర్ 21 (పెన్ పవర్): మహిళలకు సంబంధించిన ఫిర్యాదులను ప్రథమ ప్రాధాన్యతతో వేగవంతంగా విచారించి, నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్, ఐపీఎస్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో ఎస్పీ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీల మోసాలు, స్థల వివాదాలు తదితర సమస్యలపై వచ్చిన అర్జీదారుల వినతులను ఎస్పీ స్వయంగా స్వీకరించి, చట్టపరిధిలో విచారించి న్యాయం చేస్తామని వారికి భరోసా కల్పించారు.మహిళలకు సంబంధించిన అర్జీలను అత్యంత ప్రాధాన్యతతో విచారించి సకాలంలో పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు. భార్యాభర్తల మధ్య తలెత్తే కుటుంబ వివాదాల విషయంలో ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించాలని, ఇందుకోసం సఖీ వన్‌స్టాప్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలపై చేపట్టిన చర్యలకు సంబంధించిన నివేదికలను జిల్లా పోలీస్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి.జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

