శ్రీసత్య సాయి ప్రేమ వాహిని రథయాత్రను ప్రారంభించిన ఎంపీ విజయ్
నర్సీపట్నం, పెన్ పవర్ :
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ శ్రీ సత్యసాయి సేవా సమితి, శారద నగర్ వారి ఆధ్వర్యంలో చేపట్టిన ‘శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని’ రథయాత్ర శనివారం ఉదయం నర్సీపట్నంలో ఘనంగా ప్రారంభమైంది. రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ స్వగృహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ విజయ్, ఆయన సతీమణి డాక్టర్ సువర్ణ విశేష పూజలు నిర్వహించి యాత్రను లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాత్ర ఐదు రోడ్ల సెంటర్, కృష్ణ బజార్, మెయిన్ రోడ్ మీదుగా కనకదుర్గ గుడి వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చింతకాయల పద్మావతితో పాటు సత్యసాయి సేవా సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ విజయ్ మాట్లాడుతూ ఈ రథయాత్రను ప్రారంభించడం బాబా సంకల్పమని ఆనందం వ్యక్తం చేశారు. 90వ దశకంలో పుట్టపర్తికి వెళ్లి తండ్రి భుజాలపై కూర్చుని బాబాను దర్శించుకున్న మధుర స్మృతులను ఆయన గుర్తుచేసుకున్నారు. బాబా సేవా భావం నేటి తరానికి ఎంతో అవసరమన్నారు. అనంతపురం ప్రజల కోసం వందల కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మించడం, పుట్టపర్తిలో ఉచిత విద్య, వైద్యం అందించడం బాబా గొప్పదనానికి నిదర్శనమని, విదేశాల్లోనూ ఆయనకు ఎంతోమంది భక్తులు ఉన్నారని కొనియాడారు. ఎటువంటి ప్రతిఫలాపేక్ష లేని ‘సాత్విక దానం’ ప్రాముఖ్యతను బాబా చాటిచెప్పారని, ఆ స్ఫూర్తితోనే తమ తల్లి పద్మావతి గారు 2016 నుంచి నర్సీపట్నంలో ప్రతి సోమవారం నిరంతరాయంగా అన్నదానం చేస్తున్నారని విజయ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో కొంత దానం చేయాలని పిలుపునిస్తూ, రథయాత్ర విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.

