సుప్రియ మృతదేహం స్వదేశానికి.. ఎంపీ చొరవ
రెండు రోజుల్లో మృతదేహాన్ని అప్పగించే అవకాశం
ఢిల్లీలో ఉండి ఎంబసీ అధికారులతో ప్రక్రియను పర్యవేక్షిస్తున్న ఎంపీ
ఖమ్మం, పెన్ పవర్, అక్టోబర్ 6 :
ఖమ్మం: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సింహాద్రినగర్‌కు చెందిన కొదుమూరు సుప్రియ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఖమ్మం ఎంపీ రామ సాయం రఘురాం రెడ్డి చేసిన ప్రయత్నాలకు స్పందన లభించింది. ఎంపీ పంపిన లేఖకు స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్.. మృతదేహాన్ని త్వరగా భారత్‌కు తరలించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు తెలిపింది.
రెండు రోజులుగా ఎంపీ ప్రత్యేక చొరవ
సుప్రియ మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి తీసుకురావాలని కోరుతూ ఎంపీ రామ సాయం రఘురాం రెడ్డి ఈ నెల 4న అమెరికా కాన్సులేట్‌కు మెయిల్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అమెరికాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపారు. హైదరాబాద్‌లోని ప్రొటెక్టర్ ఆఫ్ ఎమిగ్రెంట్స్ అధికారులతోనూ మాట్లాడి ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు.
పోస్టుమార్టం పూర్తి.. ఎంబామింగ్ ప్రక్రియ
ఎంపీ విజ్ఞప్తికి స్పందించిన అమెరికాలోని భారత కాన్సులేట్ జనరల్ ఎం. ఆనంద్ ప్రకాశ్.. సుప్రియ పోస్టుమార్టం పూర్తయినట్లు తెలిపారు. అమెరికా అధికారులు మరణ ధ్రువీకరణ పత్రం జారీ చేయడంతో పాటు ఎంబామింగ్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారని, రెండు రోజుల్లో మృతదేహాన్ని అప్పగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అవసరమైన రవాణా ఏర్పాట్లను కాన్సులేట్ సులభతరం చేయనుంది.
కుటుంబ సభ్యులకు ఎంపీ భరోసా
సుప్రియ భర్త కొదుమూరు రంజిత్‌తో కాన్సుల్ జనరల్ మాట్లాడి సానుభూతి తెలిపారు. సంబంధిత కాన్సులేట్ అధికారి ఫోన్ నంబర్‌ను ఆయనకు అందజేశారు. మరోవైపు ఎంపీ రామ సాయం రఘురాం రెడ్డి సోమవారం సుప్రియ తల్లిదండ్రులతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. మృతదేహాన్ని వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తామని వారికి భరోసా ఇచ్చారు.

