చీరాల, అక్టోబర్ 5: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని, సమాజంలో జరుగుతున్న నేరాలు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలని చీరాల సబ్‌డివిజన్ శక్తి టీమ్ పోలీసులు సూచించారు.
బాపట్ల జిల్లా ఎస్పీ బి. ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు, డీఎస్పీ మోయిన్ సూచనలతో, చీరాల 1 టౌన్ సీఐ సోమశేఖర్ పర్యవేక్షణలో సాల్మన్ సెంటర్ సమీపంలోని ఎన్‌పీఆర్ విద్యా హైస్కూల్‌లో విద్యార్థినీ, విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా శక్తి టీమ్ కానిస్టేబుల్ కె. సుబ్బారావు బాల్యవివాహాల అనర్థాలు, పోక్సో చట్టం, ఈవ్‌టీజింగ్, మహిళలు–బాలికల భద్రత, సెల్ఫ్ డిఫెన్స్‌పై అవగాహన కల్పించారు. ఆకతాయిల వేధింపులకు భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాలో అపరిచితుల సందేశాలు, అనుమానాస్పద లింకులకు స్పందించవద్దని హెచ్చరించారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని, రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. అత్యవసర సమయంలో 100, 112, 181, 1972, 1091, 1098 హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

