మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పెరుగుతున్న ముప్పు
ఊబకాయం నియంత్రణతో అనేక అనారోగ్య సమస్యలకు చెక్: వైద్య నిపుణుడు
చీరాల, అక్టోబర్ 15 : మారుతున్న ఆహారపు అలవాట్లు, యాంత్రిక జీవనశైలి కారణంగా ఫ్యాటీ లివర్, ఊబకాయం వంటి సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణుడు జగదీష్ పోలవరపు తెలిపారు. మద్యం సేవించని వారిలోనూ అధిక బరువు, మధుమేహం వంటి కారణాలతో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
చీరాలలోని సరస్వతి గ్యాస్ట్రో అండ్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్లో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫ్యాటీ లివర్ ప్రారంభ దశలో స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలామంది సమస్యను గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. అవసరమైన వైద్య పరీక్షలు, వైద్యుల సూచనల మేరకు ఫైబ్రోస్కాన్ వంటి ఆధునిక పరీక్షలతో కాలేయ ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చని సూచించారు.
ఊబకాయం కేవలం బరువుకు సంబంధించిన సమస్య కాదని, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే పరిస్థితిగా భావించి నియంత్రించుకోవాలని సూచించారు. పొట్ట చుట్టూ అధిక కొవ్వు పెరగడం వల్ల రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యల ముప్పు పెరగవచ్చన్నారు. సామాజిక మాధ్యమాల్లో ప్రచారమయ్యే అశాస్త్రీయ డైట్ ప్లాన్లను అనుసరించకుండా నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు.
హైదరాబాద్లోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో అత్యాధునిక వైద్య సేవలు చీరాలలోనూ అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రోగి శరీర పరిస్థితిని బట్టి కడుపుపై శస్త్రచికిత్స కోతలు లేకుండా నోటి ద్వారా ఎండోస్కోప్ పంపి కడుపు పరిమాణాన్ని తగ్గించే ఎండోస్కోపిక్ స్లీవ్ గ్యాస్ట్రోప్లాస్టీ (ఈ ఎస్ జి) విధానాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఈ సేవల కోసం ప్రతి నెలా ఒకటో, మూడో గురువారాల్లో చీరాలలో తాను అందుబాటులో ఉంటానని జగదీష్ పోలవరపు తెలిపారు.
ఈ సమావేశంలో యశోద హాస్పిటల్స్ (హైటెక్ సిటీ) అసిస్టెంట్ మేనేజర్ ఖాసిం వలి పాల్గొన్నారు.

