గంగవరం, పెన్ పవర్, అక్టోబర్ 23:
పాముకాటుకు గురైన మహిళకు సకాలంలో స్పందించి, గోల్డెన్ అవర్లో పామువిష విరుగుడు మందు (ఏఎస్వీ) అందించి ప్రాణాలు కాపాడిన గంగవరం 108 అంబులెన్స్ సిబ్బందిపై గ్రామస్తులు ప్రశంసలు కురిపించారు.
గంగవరం మండలం ఎండపల్లి గ్రామానికి చెందిన పూసం పుష్ప (31) శుక్రవారం పాముకాటుకు గురైంది. సమాచారం అందుకున్న వెంటనే గంగవరం 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ చిన్నబ్బులు, పైలట్ ఎస్కే నవాజ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలి పరిస్థితిని పరిశీలించి, తక్షణమే ఏఎస్వీ (యాంటీ స్నేక్ వెనమ్) అందించి ప్రథమ చికిత్స చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆమెను గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
అత్యవసర సమయంలో 108 సిబ్బంది వేగంగా స్పందించి, సకాలంలో వైద్య సహాయం అందించడం వల్ల బాధితురాలికి సత్వర చికిత్స అందిందని గ్రామస్తులు అభినందించారు. ప్రస్తుతం బాధితురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపినట్లు సమాచారం.

