Homeఆంధ్రప్రదేశ్కాకినాడదుగ్గుదుర్రులో తగ్గేదేలే.. నువ్వా నేనా!

దుగ్గుదుర్రులో తగ్గేదేలే.. నువ్వా నేనా!

కురుపూడి కొండ.. కట్టా అప్పారావు మధ్య హోరాహోరీ పోరు

– గెలుపుపై ఇద్దరూ ధీమా..

ఓటర్ల తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ

కాజులూరు, పెన్‌పవర్‌, నవంబర్‌ 27:

కాజులూరు మండల పరిధిలోని దుగ్గుదుర్రు గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారింది. బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం కూటమి మద్దతుతో పోటీ చేస్తున్న కురుపూడి గోవిందరాజు (కొండ), కట్టా అప్పారావు మధ్యే నెలకొంది. ఇద్దరు అభ్యర్థులు తమకున్న ప్రజాబలం, గతంలో చేసిన సేవలు, రాజకీయ అనుభవమే విజయానికి బాటలు వేస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో దుగ్గుదుర్రు ఎన్నికల ఫలితంపై గ్రామంలో ఉత్కంఠ నెలకొంది.

సేవలే బలంగా కొండ ప్రచారం..

కూటమి అభ్యర్థి కురుపూడి గోవిందరాజు (కొండ) తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి పదవులు చేపట్టని ఆయన ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నారు. ప్రతి ఏడాది కార్తీకమాసంలో తన ఇంటి వద్ద ఉన్న ఉసిరి చెట్టు ప్రాంగణంలో గ్రామస్తులందరికీ వనభోజనాలు ఏర్పాటు చేయడం ఆయనకు ఆనవాయితీగా వస్తోంది. గ్రామంలో ఎవరికైనా సమస్య ఎదురైతే పార్టీ పరంగా చురుకుగా స్పందిస్తూ అందుబాటులో ఉంటారనే గుర్తింపు ఆయనకు ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. బీజేపీ నాయకులు దూడల శంకర్‌నారాయణ, రొక్కాల సత్తిబాబు, టీడీపీ నాయకులు మేడిశెట్టి పెద్ద, రంపాల రాజుతో పాటు కూటమి నాయకులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కొండ ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.

అనుభవమే అండగా అప్పారావు ధీమా..

మరోవైపు గతంలో సర్పంచ్‌గా పనిచేసిన అనుభవంతో కట్టా అప్పారావు మంచం గుర్తుపై ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో గ్రామాన్ని అభివృద్ధి చేశానని, ప్రజలకు ఎలాంటి ఆపద వచ్చినా ముందుండి ఆదుకునే వ్యక్తిగా తనకు గుర్తింపు ఉందని ఆయన చెబుతున్నారు. అన్ని పార్టీల నాయకులు, గ్రామస్తుల మద్దతుతో మరోసారి అవకాశం దక్కుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ అనుభవం, ప్రజలతో నిరంతర సంబంధాలు, అందుబాటులో ఉండే స్వభావం తనకు కలిసివస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మంచం గుర్తుపై ఓట్లు వేసి తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

ఎవరి లెక్కలు వారివే.. ఓటరు తీర్పుపై ఆసక్తి!

ఒకవైపు తొలిసారి ఎన్నికల బరిలోకి దిగిన కొండ సేవలను నమ్ముకోగా, మరోవైపు మాజీ సర్పంచ్‌ అప్పారావు తన అనుభవాన్ని నమ్ముకున్నారు. ఇద్దరికీ గ్రామంలో తమదైన బలం ఉందని భావిస్తుండటంతో ప్రచారంలో పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది. ఉంగరం గుర్తు.. మంచం గుర్తు మధ్య సాగుతున్న ఈ పోరులో ఓటర్లు ఎవరికి పట్టం కడతారన్నది ఇప్పుడు గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరూ గెలుపుపై ధీమాతో ఉండటంతో దుగ్గుదుర్రు పంచాయతీ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular