Homeతెలంగాణహైదరాబాద్నాచారం బాబానగర్‌లో టెర్షియరీ ట్రీటెడ్ వాటర్ కేంద్రం ప్రారంభం

నాచారం బాబానగర్‌లో టెర్షియరీ ట్రీటెడ్ వాటర్ కేంద్రం ప్రారంభం

నాచారం బాబానగర్‌లో టెర్షియరీ ట్రీటెడ్ వాటర్ కేంద్రం ప్రారంభం

నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగానికి శ్రీకారం

భూగర్భ జలాల పరిరక్షణే లక్ష్యం

కాప్రా, పెన్ పవర్, నవంబర్ 16:

హైదరాబాద్ నగరంలో తాగునీటి వనరుల సంరక్షణ, భూగర్భ జలాల పరిరక్షణ లక్ష్యంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెర్షియరీ ట్రీటెడ్ వాటర్ (శుద్ధి చేసిన మురుగునీరు) సరఫరా కేంద్రాన్ని సోమవారం ఉప్పల్ నియోజకవర్గం నాచారం బాబానగర్ ఎస్టీఓలో హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా నాచారంలోని నిర్వాణ కన్‌స్ట్రక్షన్స్‌కు టెర్షియరీ ట్రీటెడ్ వాటర్‌తో కూడిన తొలి ట్యాంకర్‌ను అధికారికంగా సరఫరా చేశారు. నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన మురుగునీటిని పునర్వినియోగంలోకి తీసుకురావడం ద్వారా తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించే దిశగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

అనంతరం నిర్మాణ ప్రదేశాన్ని సందర్శించిన అధికారులు బిల్డర్లు, సైట్ సూపర్‌వైజర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నివాస భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, మౌలిక సదుపాయాల నిర్మాణ పనుల్లో శుద్ధి చేసిన నీటిని వినియోగించడం వల్ల కలిగే సాంకేతిక ప్రయోజనాలు, నీటి నాణ్యత ప్రమాణాలు, సురక్షిత వినియోగ పద్ధతులను వివరించారు.

రానున్న రోజుల్లో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో పాటు భూగర్భ జలమట్టాలు తగ్గిపోయే ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్మాణ సంస్థలు భవన నిర్మాణ పనులకు భూగర్భ జలాలను వినియోగించకుండా, సాంకేతికంగా అనుకూలమైన చోట నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా శుద్ధి చేసిన మురుగునీటిని వినియోగించాలని అధికారులు సూచించారు.

తాగునీటి వనరులపై ఒత్తిడి తగ్గించడం, భూగర్భ జలాలను కాపాడటం, నీటి వృథాను అరికట్టడం, పర్యావరణహిత నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

నగరంలో శుద్ధి చేసిన మురుగునీటి పునర్వినియోగాన్ని మరింత విస్తృతం చేయడంతో పాటు విలువైన తాగునీటి వనరులను పరిరక్షించి భవిష్యత్ తరాలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యంగా హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. బిల్డర్లు, నిర్మాణ సంస్థలు, డెవలపర్లు నిర్మాణ పనులకు టెర్షియరీ ట్రీటెడ్ వాటర్‌ను వినియోగిస్తూ భూగర్భ జలాల పరిరక్షణలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్లు, జనరల్ మేనేజర్లు, డిప్యూటీ జనరల్ మేనేజర్లు, మేనేజర్లు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular