డిసెంబర్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్, వాహన రిజిస్ట్రేషన్‌పై కఠిన తనిఖీలు
వాహనదారులు 15 రోజుల్లోగా పత్రాలు తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి: ఐటీడీఏ పీవో చిట్టపులి నరేంద్ర పడాల్చిం
చింతూరు , పెన్ పవర్ నవంబర్ 16:
చింతూరు డివిజన్ పరిధిలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్లను సోమవారం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి, చింతూరు సబ్ కలెక్టర్ చిట్టపులి నరేంద్ర పడాల్, ఐఏఎస్ ఆధ్వర్యంలో పోలీస్, రెవెన్యూ, నేషనల్ హైవే అధికారుల బృందం సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఈ సందర్భంగా చింతూరు డీఎస్పీ ఉదయ్ పావని, చింతూరు సీఐ, తహశీల్దార్, నేషనల్ హైవే అసిస్టెంట్ ఇంజనీర్ తదితర అధికారులు పాల్గొన్నారు. ప్రమాదాలు జరిగే ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి, ప్రమాదకర మలుపులు, రోడ్ల వెడల్పు, వాహనాల రాకపోకలు, హెచ్చరిక బోర్డుల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించారు. ప్రమాదాలకు కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. డిసెంబర్ నుంచి ప్రత్యేక తనిఖీలు ఈ సందర్భంగా ఐటీడీఏ పీవో నరేంద్ర పడాల్ మాట్లాడుతూ. చింతూరు డివిజన్ పరిధిలో ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, ప్రతి వాహనానికి చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్ ఉండాలని స్పష్టం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, వాహన రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోని వారు మరో 15 రోజుల్లోగా సంబంధిత ఆర్టీఓ కార్యాలయం ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించారు. డిసెంబర్ నెల నుంచి పోలీస్, రవాణా శాఖ అధికారుల ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లైసెన్స్, రిజిస్ట్రేషన్ పత్రాలు లేకుండా వాహనాలు నడిపితే నిబంధనల ప్రకారం జరిమానాలు, ఇతర చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రిపుల్ రైడింగ్‌కు దూరంగా ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ చేయకూడదని, వాహనం నడిపేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని తెలిపారు. నాలుగు చక్రాల వాహనదారులు సీటు బెల్టు ధరించాలని, రహదారి సూచికలు, హెచ్చరిక బోర్డులను గమనిస్తూ ప్రయాణించాలని పేర్కొన్నారు. ప్రమాదకర మలుపులు, బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు, రోడ్డు భద్రతా సూచికలు ఏర్పాటు చేయడంతో పాటు అవసరమైన రహదారి భద్రతా మెరుగుదలలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులకు సూచించారు. ప్రజల సహకారంతోనే ప్రమాదాల నివారణ రోడ్డు ప్రమాదాలు ఒక కుటుంబానికే కాకుండా మొత్తం సమాజానికి తీరని నష్టాన్ని కలిగిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు రహదారి భద్రతకు అవసరమైన చర్యలు చేపడుతున్నప్పటికీ, ప్రజలు కూడా బాధ్యతగా ట్రాఫిక్ నిబంధనలు పాటించినప్పుడే ప్రమాదాలను నివారించడం సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతను వ్యక్తిగత బాధ్యతగా భావించి, అవసరమైన వాహన పత్రాలతోనే ప్రయాణించాలని, జాగ్రత్తలు పాటిస్తూ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని అధికారులు చింతూరు డివిజన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

