చెన్నైకి తరలిస్తున్న 30 కేజీల గంజాయి పట్టివేత
ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు
డొంకరాయి పోలీసుల అప్రమత్తతతో భారీ గంజాయి స్వాధీనం
చింతూరు, పెన్ పవర్, మే 7:
డొంకరాయి పోలీసులు అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను అడ్డుకుని 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఒడిశా నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం. చెన్నై ప్రాంతానికి చెందిన విజయ్ కుమార్ (తండ్రి పెరుమల్), నరేష్ కుమార్ పద్మనాభం (తండ్రి పద్మనాభం), కార్తీక్ (తండ్రి డయాసిస్) అనే ముగ్గురు వ్యక్తులు ముందుగా చెన్నై నుంచి రైలులో రాజమండ్రికి చేరుకున్నారు. అక్కడి నుంచి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ద్వారా సీలేరు చేరుకుని అనంతరం ఒడిశా రాష్ట్రానికి వెళ్లారు. ఒడిశాలో 30 కేజీల గంజాయిని సేకరించిన నిందితులు దానిని చెన్నైకి తరలించే ప్రయత్నంలో భాగంగా టూ వీలర్లు, ఆటోల ద్వారా లిఫ్ట్ అడుగుతూ డొంకరాయి కెనాన్ సమీపంలోని అమ్మవారి గుడి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న డొంకరాయి ఎస్సై తన సిబ్బందితో వెంటనే అప్రమత్తమై నిఘా ఏర్పాటు చేశారు. పోలీసుల కదలికలను గమనించిన నిందితులు డ్యాం పై నుంచి పోలీస్ స్టేషన్ వైపు రాకుండా అడవి మార్గంలో కాలినడకన వెళ్లి తప్పించుకోవాలని ప్రయత్నించారు. అయితే ఎస్సై సిబ్బందితో కలిసి చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను పట్టుకుని వారి వద్ద ఉన్న 30 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డొంకరాయి పోలీసులు వెల్లడించారు.

