Homeఆంధ్రప్రదేశ్పోలవరంవిద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

విద్యుత్ షాక్‌తో కాంట్రాక్ట్ కార్మికుడు మృతి

సీఐటీయూ ఆధ్వర్యంలో నాలుగు గంటల ఆందోళన.

రూ.27 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగంపై హామీ

చింతూరు, పెన్ పవర్, ఆగస్టు 11:

ఏపీ జెన్‌కో మోతుగూడెం పరిధిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికుడు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. మృతుడు గూడూరు గ్రామానికి చెందిన మడివి ముత్తయ్యగా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. మడివి ముత్తయ్య ఏపీ జెన్‌కో డిస్ట్రిబ్యూషన్‌లో కాంట్రాక్ట్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. మంగళవారం విధి నిర్వహణలో భాగంగా పవర్‌హౌస్‌ నుంచి పోలూరు వైపు వెళ్లే 33 కేవీ విద్యుత్‌ లైన్‌ వద్ద పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌కు గురై మృతి చెందారు. ఈ ఘటనకు పై అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమని ఆరోపిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు, మృతుడి కుటుంబ సభ్యులు నాలుగు గంటలపాటు ఆందోళన చేపట్టారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, నష్టపరిహారం అందించాలని, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళన నేపథ్యంలో అధికారులు స్పందించి చర్చలు జరిపారు. చివరకు మృతుడి కుటుంబానికి రూ.27 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించడంతో పాటు ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జెన్‌కో అధికారులు సీఈ, ఎస్‌ఈలు లిఖితపూర్వకంగా హామీ పత్రం అందజేసినట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు. మరోవైపు ఘటనపై మోతుగూడెం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చింతూరు సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు మోతుగూడెం ఎస్‌ఐ సీహెచ్‌ కృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular