ePaper
Sunday, June 14, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్లోక్‌సభ పునర్విభజనకు కసరత్తు..

లోక్‌సభ పునర్విభజనకు కసరత్తు..

📰 Generate e-Paper Clip

  • మూడు ముక్కలుగా కీలక పార్లమెంట్ నియోజకవర్గాలు.. 
  • ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు అవకాశం
  • దేశవ్యాప్తంగా 824 లోక్‌సభ స్థానాల ప్రతిపాదన
  • ఏపీలో ఆరు, తెలంగాణలో నాలుగు నియోజకవర్గాల త్రివిభజన
  • భాషా వైవిధ్యం, పట్టణీకరణకు ప్రాధాన్యం
  • ఓటింగ్ శాతం పెంపే ప్రధాన లక్ష్యం
  • తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరగనున్న సీట్లు
  • పునర్విభజన బిల్లుపై పార్లమెంట్‌లో చర్చకు అవకాశం

 
దేశవ్యాప్తంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) చేసిన తాజా సిఫార్సుల్లో ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని ప్రతిపాదించడంతో పాటు, జనాభా పెరుగుదల, పట్టణీకరణ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, భాషా వైవిధ్యం వంటి అంశాల ఆధారంగా పలు నియోజకవర్గాలను రెండుగా, మూడుగా విభజించాలని సూచించింది.  ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26 లోక్‌సభ స్థానాలు పెరగనున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు కీలక నియోజకవర్గాలు మూడు భాగాలుగా విడిపోనున్న నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు, భవిష్యత్ ఎన్నికల వ్యూహాలు పూర్తిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

స్టేట్ బ్యూరో పెన్ పవర్ , విజయవాడ జూన్ 13: 

లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన అంశం దేశ రాజకీయాల్లో మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ-పీఎం) సమర్పించిన తాజా నివేదికలో ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాలను 824కు పెంచాలని ప్రతిపాదించడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, సామాజిక వర్గాల ప్రాతినిధ్యం, భాషాపరమైన వైవిధ్యం, ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ ప్రతిపాదనలు రూపొందించినట్లు మండలి పేర్కొంది.

నివేదిక ప్రకారం దేశంలోని 59 లోక్‌సభ నియోజకవర్గాలను రెండుగా, 111 నియోజకవర్గాలను మూడుగా విభజించాలని సూచించారు. అన్ని నియోజకవర్గాలను పునర్విభజించాల్సిన అవసరం లేదని, అధిక జనాభా, విస్తార భౌగోళిక పరిధి, పట్టణీకరణ ఎక్కువగా ఉన్న 170 నియోజకవర్గాలపై మాత్రమే దృష్టి సారిస్తే సరిపోతుందని మండలి అభిప్రాయపడింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం, రాజంపేట, కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల లోక్‌సభ నియోజకవర్గాలను మూడు భాగాలుగా విభజించాలని సిఫార్సు చేసింది. మచిలీపట్నం నియోజకవర్గాన్ని రెండుగా విభజించాలని సూచించింది. తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, మెదక్ నియోజకవర్గాలను మూడుగా, చేవెళ్లను రెండుగా విభజించాలని ప్రతిపాదించింది.

భాషాపరమైన వైవిధ్యం, ఓటర్ల సామాజిక నిర్మాణం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయని మండలి విశ్లేషించింది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉర్దూ, తెలుగు, హిందీ మాట్లాడే వర్గాల మధ్య ఉన్న భాషాపరమైన విభజన కారణంగా అక్కడ పోలరైజేషన్ స్కోర్ అధికంగా నమోదైనట్లు పేర్కొంది. ఇదే కారణంతో హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి పట్టణ నియోజకవర్గాలను చిన్న యూనిట్లుగా విభజిస్తే ప్రజాప్రాతినిధ్యం మరింత మెరుగుపడుతుందని నివేదిక తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో నంద్యాల, రాజంపేట, కడప, విశాఖపట్నం నియోజకవర్గాల్లో కూడా భాషా, సామాజిక వైవిధ్యం ఎక్కువగా ఉందని గుర్తించింది. ఈ నియోజకవర్గాలను విభజించడం ద్వారా ఓటర్ల భాగస్వామ్యం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసింది. విశాఖపట్నం విభజనతో 15.88 శాతం పాయింట్లు, కడపలో 15.39 శాతం, రాజంపేటలో 14.47 శాతం, నంద్యాలలో 14.22 శాతం మేర ఓటింగ్ పెరిగే అవకాశముందని పేర్కొంది.

దేశవ్యాప్తంగా ఈ పునర్విభజన అమలు చేస్తే సగటున 2.32 శాతం ఓటింగ్ పెరుగుతుందని, దాదాపు 2.23 కోట్ల మంది అదనపు ఓటర్లు ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశముందని నివేదిక వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండనుందని, ఆంధ్రప్రదేశ్‌లో 3.52 శాతం, తెలంగాణలో 6.55 శాతం వరకు ఓటింగ్ పెరగవచ్చని అంచనా వేసింది. సీట్ల పెంపు విషయంలో కూడా ఈ నివేదిక కీలక సూచనలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రస్తుతం ఉన్న 25 లోక్‌సభ స్థానాలు 38కు, తెలంగాణలో 17 స్థానాలు 26కు పెరిగే అవకాశం ఉందని తెలిపింది. అలాగే కర్ణాటకలో 28 నుంచి 42, తమిళనాడులో 39 నుంచి 59, కేరళలో 20 నుంచి 30 స్థానాలకు పెరుగుతాయని అంచనా వేసింది.

పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన కేవలం పరిపాలనా అంశమే కాకుండా భవిష్యత్ రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే కీలక ప్రక్రియగా భావిస్తున్నారు. కొత్త నియోజకవర్గాల ఏర్పాటు, రిజర్వేషన్ మార్పులు, రాజకీయ పార్టీల బలాబలాల పునర్నిర్మాణం వంటి అంశాలు ఇందులో భాగమవుతాయి. అందువల్ల ఈ సిఫార్సులపై కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దేశ రాజకీయాలపై గణనీయ ప్రభావం చూపే అవకాశం ఉంది.  వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో పునర్విభజనకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. అయితే తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ ఆమోదంపై ఆధారపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు, కొత్త రాజకీయ సమీకరణాలపై ఇప్పటికే ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular