బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, విశాఖపట్నం, జూలై 04: స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) ప్రధాన కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏపీఈపీడీసీఎల్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీతేజ్ ఇమ్మడి అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశ స్వాతంత్ర్యం కోసం తన ప్రాణాలను అర్పించిన మహోన్నత విప్లవ వీరుడని కొనియాడారు.
గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఆయన చేసిన పోరాటం, దేశభక్తి, త్యాగం నేటి తరాలకు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. యువత అల్లూరి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.కార్యక్రమంలో సంస్థ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ టి. వనజ, చీఫ్ జనరల్ మేనేజర్లు డి. సుమన్ కళ్యాణి, వి. విజయలలిత, బి. అశోక్ కుమార్, ఎస్. రాజబాబు, ఎల్. మహేంద్రనాధ్, ఎస్. విజయ్ ప్రతాప్, పి. సోల్మన్ రాజు, ఇతర సీనియర్ అధికారులు, ఉద్యోగులు పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.

