ఘనంగా అల్లూరి జయంతి వేడుకలు నిర్వహించిన అనకాపల్లి జిల్లా పోలీసు శాఖ
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్, అనకాపల్లి జులై 04: మన్యం వీరుడు, విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం ఘనంగా నివాళులర్పించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పోలీసు అధికారులు, సిబ్బంది అల్లూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ ఎల్. మోహనరావు మాట్లాడుతూ, బ్రిటిష్ వలస పాలకుల నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం అల్లూరి సీతారామరాజు చేసిన సాయుధ పోరాటం భారత స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ అధ్యాయమని పేర్కొన్నారు. అల్లూరి జయంతి తెలుగు ప్రజలకే కాకుండా దేశానికే గర్వకారణమని, ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడిన మహనీయుడిగా ఆయన చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు.
1924 మే 7న మంప ప్రాంతంలో బ్రిటిష్ తూటాలకు బలైన అల్లూరి త్యాగం దేశభక్తికి ప్రతీకగా నిలిచిందని, ఆయన ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకుని దేశసేవకు అంకితభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు లక్ష్మి, శ్రీనివాసరావు, పిల్లా రమేష్, సూరి నాయుడు, ఎస్సైలు ప్రసాద్, సురేష్ బాబు, అంజిబాబు, ఆఫీస్ సూపరింటెండెంట్ ప్రతాప్ శేషయ్యతో పాటు జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని అల్లూరి సీతారామరాజుకు ఘనంగా నివాళులర్పించారు.

