కార్మికుల 9 నెలల వేతన బకాయిలపై వెంటనే చర్యలకు ఆదేశం
కాజులూరు, జూలై 22 ,పెన్ పవర్: కాకినాడ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ బుధవారం కాజులూరు మండలంలో సుడిగాలి పర్యటన నిర్వహించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా గొల్లపాలెం సీపీడబ్ల్యూఎస్ చెరువును తనిఖీ చేసి తాగునీటి సరఫరా, ఫిల్టరేషన్ వ్యవస్థపై అధికారులను ప్రశ్నించడంతో పాటు, అక్కడ పనిచేస్తున్న కార్మికుల తొమ్మిది నెలల వేతన బకాయిల సమస్యపై వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా గొల్లపాలెంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్, ఓపీ నమోదు, మందుల పంపిణీ, వార్డుల నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు.ఆసుపత్రికి వచ్చిన రోగులతో మాట్లాడి సేవలపై ఆరా తీశారు.ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచించారు.అనంతరం సీపీడబ్ల్యూఎస్ పథకంలో భాగంగా గొల్లపాలెం చెరువును సందర్శించి మండలంలోని గ్రామాలకు తాగునీటి సరఫరా, ఫిల్టరేషన్ ప్రక్రియను పరిశీలించారు.
తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఎక్కడా మంచినీటి సమస్య రాకుండా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు.ఈ సందర్భంగా చెరువు వద్ద పనిచేస్తున్న కార్మికుడు ఏడిద నాగేశ్వరరావు (కన్నా) మాట్లాడుతూ, సంబంధిత కాంట్రాక్టర్ తొమ్మిది నెలలుగా తమకు వేతనాలు చెల్లించలేదని నేరుగా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను విన్న కలెక్టర్ వెంటనే స్పందించి సంబంధిత లేబర్ అధికారితో ఫోన్లో మాట్లాడి కార్మికుల వేతన బకాయిల అంశాన్ని అత్యవసరంగా పరిష్కరించాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు త్వరలోనే కార్మికులకు బకాయి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని లేబర్ అధికారి హామీ ఇవ్వడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు.తదుపరి ఆర్యావటంలోని స్వర్ణ గ్రామ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న సేవలు, పారిశుధ్య నిర్వహణ, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు.ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు సమర్థ వంతంగా చేరవేయడంలో గ్రామస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని సూచించారు.చేదువాడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్ చిన్నారులతో ముచ్చటించి, వారికి అందిస్తున్న పౌష్టికాహారం నాణ్యతపై ఆరా తీశారు. చిన్నారులకు సకాలంలో నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని నిర్వాహకులకు సూచించారు.

కాజులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ ‘డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం’ అమలు తీరును,కిచెన్ షెడ్,తాగునీటి, మరుగుదొడ్ల వసతులను పరిశీలించారు.పదో తరగతి విద్యార్థులతో మాట్లాడి చదువుపై దృష్టి సారించాలని సూచించడంతో పాటు, వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇప్పటి నుంచే పబ్లిక్ పరీక్షలకు సిద్ధం చేయాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.ఈ పర్యటనలో కలెక్టర్ వెంట కాజులూరు తహసీల్దార్ జి. ఆర్.ఠాగూర్,ఆర్ఐ వేగేశ్వరరావు, ఎంపీడీవో జే.రాంబాబు,ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రూప, గొల్లపాలెం పంచాయతీ కార్యదర్శి సీహెచ్. సూర్యప్రకాశరావు, వైద్యులు డాక్టర్ సౌజన్య, డాక్టర్ శ్రేయ, ఆర్యవటం పంచాయతీ కార్యదర్శి విశ్వేశ్వరరావు, పంచాయతీ సిబ్బంది, వీఆర్వో లు సాదనాల శ్రావణి, ఆర్.రాయుడు,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

