మంత్రుల సమావేశాన్ని బహిష్కరించే ఆలోచనలో దండకారణ్య విమోచన సమితి
గూడెం కొత్త వీధి, పెన్ పవర్, జూలై 27: ఆదివాసీ హక్కులు, చట్టాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని, చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నాయని దండకారణ్య విమోచన సమితి (డీఎల్ఓ) రాష్ట్ర అధ్యక్షుడు కోర్రా మార్క్ రాజు విమర్శించారు. ప్రజా సంఘాలతో పలుమార్లు చర్చలు జరిపినా ఇప్పటివరకు ఎలాంటి చట్టపరమైన నిర్ణయం తీసుకోకపోవడం విచారకరమని పేర్కొన్నారు.ఏజెన్సీ ప్రాంత ఉద్యోగ నియామకాలకు కీలకమైన జీవో నెం.3ను సుప్రీంకోర్టు 2020లో రద్దు చేసిన అనంతరం అప్పటి ప్రభుత్వం ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ (టీఏసీ)లో తీర్మానం చేసినప్పటికీ, ప్రత్యామ్నాయ చట్టం తీసుకురాలేదని ఆరోపించారు. అనంతరం జరిగిన ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెం.3కు ప్రత్యామ్నాయంగా చట్టబద్ధమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారని, ఆ హామీని నమ్మిన ఆదివాసీలు కూటమికి మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.మెగా డీఎస్సీకి ముందు ఏజెన్సీ ప్రాంతంలో ప్రత్యేక చట్టం తీసుకువచ్చి అనంతరమే ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని తమ సంఘం ప్రభుత్వాన్ని కోరిందని, ఈ డిమాండ్‌పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కూడా నిర్వహించామని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, సంబంధిత కమిటీలతో పలుమార్లు చర్చలు జరిగినప్పటికీ స్పష్టమైన నిర్ణయం వెలువడలేదని పేర్కొన్నారు.ప్రత్యామ్నాయ చట్టం తీసుకురాకుండానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి, ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీలకు దక్కాల్సిన సుమారు 4,000 ఉపాధ్యాయ పోస్టులను గిరిజనేతరులతో భర్తీ చేశారని డీఎల్ఓ ఆరోపించింది. ఇప్పటివరకు ఆరు దఫాల చర్చలు జరిగినా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఆదివాసీలను మభ్యపెడుతోందని విమర్శించింది.ఏజెన్సీ ప్రాంతంలోని 1/70 చట్టాన్ని రద్దు చేయాలని దాఖలైన కేసుపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కౌంటర్ దాఖలు చేయలేదని, ఈ విషయంపై జాతీయ ఎస్టీ కమిషన్ రెండు తెలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసినా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు.ఇటీవల పాడేరులో ఆదివాసీ యువత చేపట్టిన నిరసనల అనంతరం ప్రభుత్వం కొన్ని సంఘాలతో మాత్రమే చర్చలు జరిపి ఎలాంటి ప్రకటన చేయలేదని ఆరోపించిన డీఎల్ఓ, ఇప్పుడు మరోసారి నిర్వహించనున్న మంత్రుల సమావేశం కూడా కాలయాపనలో భాగమేనని భావిస్తున్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో చిత్తశుద్ధి లేని చర్చలను బహిష్కరించే ఆలోచనలో దండకారణ్య విమోచన సమితి, దాని అనుబంధ సంఘాలు ఉన్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు కోర్రా మార్క్ రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కిల్లో మనోజ్ కుమార్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు.

