భోగాపురం ఎయిర్‌పోర్టుతో ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశ
ఆగస్టు 1న ప్రధాని చేతుల మీదుగా రూ.17,912 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం
రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జులై 29 : ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఉత్తరాంధ్ర నేడు కార్పొరేట్ సంస్థలకు ఆకర్షణీయ గమ్యంగా మారుతోందని రాష్ట్ర సమాచార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భోగాపురంలో నిర్మితమవుతున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల కలను సాకారం చేస్తూ, “గేట్‌వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్ర”గా నిలవబోతుందని పేర్కొన్నారు.
విశాఖ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, దేశంలోనే అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయంగా భోగాపురం ఎయిర్‌పోర్టును పర్యావరణ ప్రమాణాలకు అనుగుణంగా, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించే ఎగిరే చేప ఆకృతిలో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ విమానాశ్రయం ప్రయాణ సౌకర్యాలకే పరిమితం కాకుండా ఎగుమతులు, పర్యాటకం, లాజిస్టిక్స్ రంగాలకు ఊతమిచ్చి ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందన్నారు.
విమానాశ్రయంతో పాటు 500 ఎకరాల్లో ఏవియేషన్ హబ్, విమానాల తయారీ, మరమ్మతు కేంద్రాలు, స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్, ఎడ్యూ సిటీ, ఏసిప్ తదితర ప్రాజెక్టులను కూడా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దీంతో ఉత్తరాంధ్రలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం ఏర్పడటంతో పాటు యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ పాలనలో అభివృద్ధి వెనుకబడిందని, మూడు రాజధానుల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించారని మంత్రి విమర్శించారు. భోగాపురం విమానాశ్రయంపై గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు అసత్యమని తేలిపోయాయని అన్నారు. విశాఖకు గూగుల్ డేటా సెంటర్‌ను తీసుకొచ్చామని చెప్పుకునే వారు, దాని పనులు ఎందుకు ప్రారంభించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు.
ఆగస్టు 1న ప్రధానమంత్రి చేతుల మీదుగా రూ.17,912 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగనున్నాయని వెల్లడించారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభం ఉత్తరాంధ్రకే కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చరిత్రలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎయిర్‌పోర్టు మీడియా సమన్వయ కమిటీ సభ్యులు వెన్న శ్రీరామమూర్తి, డి.ఎస్. వర్మ తదితరులు పాల్గొన్నారు.

