చింతూరు, పెన్ పవర్ జూలై 30:
చడలవాడ పంచాయతీ పరిధిలోని సోకులేరు వాగులో ప్రమాదవశాత్తు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాలు గురువారం లభ్యమయ్యాయి. మృతులు పెండెం బాబి, పెండెం కళ్యాణ్లుగా పోలీసులు గుర్తించారు. ఈ నెల 28న సోకులేరు వ్యూ పాయింట్ సమీపంలో జరిగిన ఘటన అనంతరం, చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ సీహెచ్. గోపాలకృష్ణ పర్యవేక్షణలో మోతుగూడెం ఎస్ఐ అబ్దుల్ నాసిర్ హుస్సేన్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది, ఏఎన్ఎస్ బృందం, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక గ్రామస్తులు కలిసి గత రెండు రోజులుగా విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. గురువారం మధ్యాహ్నం తులసిపాక గ్రామ సమీపంలోని సోకులేరు వ్యూ పాయింట్‌కు సుమారు 100 మీటర్ల దూరంలో నీటిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, కుటుంబ సభ్యుల గుర్తింపుతో తదుపరి చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొనగా, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేస్తూ, వర్షాకాలంలో వాగులు, నదులు, జలాశయాలు, వరద నీటి ప్రవాహాల వద్ద అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.


