పెన్ పవర్ వార్తకు స్పందన
ఆరిలోవలో బోరుమంటున్న బోరు బావులు ఆగని భగీరథయత్నం
జీవీఎంసీ అధికారులతో కదిరిన యంత్రాంగం
ఆరిలోవ హెల్త్ సిటీలోని ఆసుపత్రులపై జీవీఎంసీ ఆకస్మిక తనిఖీలు
జీవీఎంసీ బల్క్ వాటర్‌ను వినియోగించకుండా, అనుమతి లేని బోర్వెల్ ద్వారా భూగర్భ జలాల వినియోగంపై కఠిన చర్యలు
– జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు
విశాఖ తూర్పు పెన్ పవర్, ఆగస్టు 4:

జీవీఎంసీ పరిధిలోని ఆరిలోవ హెల్త్ సిటీ ప్రాంతంలో ఉన్న ఆసుపత్రుల్లో భూగర్భ జలాలను అనుమతి లేకుండా వినియోగించడం వలన పరిసర ప్రాంత ప్రజలకు తాగునీటి సరఫరాపై ప్రతికూల ప్రభావం పడుతున్న నేపథ్యంలో జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు మంగళవారం పలు ఆసుపత్రులపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు జీవీఎంసీ నీటి సరఫరా విభాగం పర్యవేక్షక ఇంజనీర్ పల్లంరాజు తెలిపారు.
ఈ సందర్భంగా పర్యవే
క్షక ఇంజనీర్ మాట్లాడుతూ, తనిఖీల సందర్భంగా కొన్ని ఆసుపత్రులు జీవీఎంసీ బల్క్ వాటర్ కనెక్షన్లు తీసుకున్నప్పటికీ వాటిని వినియోగించకుండా, బోర్వెల్ల ద్వారా అధికంగా భూగర్భ జలాలను వినియోగిస్తున్నట్లు, మరికొన్ని ఆసుపత్రులు జీవీఎంసీ బల్క్ వాటర్ కనెక్షన్ తీసుకోకుండానే పూర్తిగా భూగర్భ జలాలను అనుమతి లేకుండా వినియోగిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. దీంతో సమీప ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ఆసుపత్రుల యాజమాన్యాలకు ఏడు రోజుల్లోగా జీవీఎంసీ బల్క్ వాటర్ కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలని, అలాగే అనుమతి లేకుండా బోర్వెల్ల ద్వారా భూగర్భ జలాలను వినియోగించరాదని స్పష్టం చేస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు.
ప్రజలకు నాణ్యమైన తాగునీటిని నిరంతరాయంగా అందించడం జీవీఎంసీ ప్రధాన లక్ష్యమని పల్లంరాజు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ భూగర్భ జలాలను అక్రమంగా వినియోగించే ఆసుపత్రులు, వాణిజ్య సంస్థలు, ఇతర సంస్థలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని, నోటీసులు జారీ చేసిన తర్వాత కూడా నిబంధనలు పాటించని వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలకు తాగునీటి సరఫరాకు ఆటంకం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో కార్యనిర్వాహక ఇంజనీర్లు, ఉప కార్యనిర్వాహక ఇంజనీర్లు, సహాయక ఇంజనీర్లు, వార్డు అమెనిటీస్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

