Homeఆంధ్రప్రదేశ్పోలవరంమన్యం బంద్‌కు ఆటంకాలు కల్పించవద్దని ప్రభుత్వానికి హ్యూమన్ రైట్స్ వాచ్ విజ్ఞప్తి

మన్యం బంద్‌కు ఆటంకాలు కల్పించవద్దని ప్రభుత్వానికి హ్యూమన్ రైట్స్ వాచ్ విజ్ఞప్తి

 

రంపచోడవరం, ఆగస్టు 6 (పెన్ పవర్): ఆగస్టు 8న ప్రతిపాదిత “మాన్యం బంద్” సందర్భంగా శాంతియుత సమావేశాలు, ప్రజా అవగాహన కార్యక్రమాలు, బంద్ నిర్వహణకు ఎలాంటి చట్టవిరుద్ధ ఆటంకాలు కలగకుండా చర్యలు తీసుకోవాలని హ్యూమన్ రైట్స్ వాచ్ డైరెక్టర్ బాలు అక్కిస రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)లకు ఈ-మెయిల్ ద్వారా వినతిపత్రాన్ని పంపినట్లు తెలిపారు.

వినతిపత్రంలో ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో షెడ్యూల్డ్ తెగల స్థానిక ఉద్యోగ హక్కులను పరిరక్షించే జి.ఓ. ఎంఎస్. నెం.3 పునరుద్ధరణతో పాటు, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ప్రాంతాల భూ బదిలీల నియంత్రణ చట్టం (రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970)ను సమర్థంగా అమలు చేయాలని ఆదివాసీ సంఘాలు చాలా కాలంగా శాంతియుతంగా డిమాండ్ చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వివిధ ఆదివాసీ సంఘాలు, పౌర సమాజ సంస్థలు ఆగస్టు 8న మాన్యం బంద్‌కు పిలుపునిచ్చినట్లు వివరించారు.

కొన్ని ఏజెన్సీ జిల్లాల్లో బంద్‌కు అనుమతి లేదంటూ పోలీసులు ప్రకటనలు విడుదల చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇటువంటి చర్యలు ప్రజలు తమ రాజ్యాంగబద్ధ హక్కులను వినియోగించుకోవడంపై ఆందోళన కలిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. గిరిజన ప్రాంతాల్లో శాంతియుత నిరసనలు, స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత వంటి కార్యక్రమాలు సామాజిక సంప్రదాయంలో భాగమేనని, అవి పూర్తిగా స్వచ్ఛందంగా, చట్టబద్ధంగానే జరుగుతాయని తెలిపారు.

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రకారం శాంతియుతంగా సమావేశాలు నిర్వహించడం, అభిప్రాయాలను వ్యక్తీకరించడం, సంఘాలను ఏర్పాటు చేసుకోవడం వంటి హక్కులకు రక్షణ ఉందని గుర్తు చేస్తూ, ఏజెన్సీ జిల్లాల కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంట్లు మరియు సంబంధిత అధికారులకు చట్టవిరుద్ధ ఆటంకాలు కలగకుండా తగిన ఆదేశాలు జారీ చేయాలని ప్రభుత్వాన్ని బాలు అక్కిస విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular