పెన్ పవర్ కథనానికి స్పందన.. గ్రామాల్లో వైద్య శిబిరాలు, శానిటేషన్ కార్యక్రమాలు
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 7:
ఆగస్టు 5న పెన్ పవర్ దినపత్రికలో ప్రచురితమైన “దోమలమయం… రోగాల భయం” కథనానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెంటనే స్పందించారు. దోమల ద్వారా వ్యాపించే డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి వ్యాధులను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. గార్ల కోత్త తండాగ్రామాల్లో శుక్రవారం వైద్య సిబ్బంది ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు ఆరోగ్య పరీక్షలు చేశారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి అవసరమైన మందులు అందించడంతో పాటు, అప్రమత్తంగా ఉండాల్సిన సూచనలుఇచ్చారు.అదేవిధంగా గ్రామపంచాయతీ సిబ్బందితో కలిసి ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టి వీధులు, మురుగు కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను శుభ్రం చేశారు. దోమల నివారణ కోసం లార్వా నిర్మూలన చర్యలు చేపట్టడంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పించారు.ఇందులో భాగంగా “ఫ్రైడే డ్రై డే” కార్యక్రమాన్ని నిర్వహించి, ప్రతి శుక్రవారం ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, కుండీలు తదితర వాటిలో నిల్వ నీటిని తొలగించాలని ప్రజలకు సూచించారు. ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యపై వెలువడిన పెన్ పవర్ కథనానికి అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టడం పట్ల గ్రామస్థులు హర్షం వ్యక్తం చేసి పెన్ పవర్ యాజమాన్యానికి రిపోర్టర్ దువ్వా సతీష్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బంది వైద్య సిబ్బంది సమన్వయంతో ఇటువంటి చర్యలను నిరంతరం కొనసాగించి దోమల నివారణపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హనుమంతరావు హెచ్ ఈ ఓ లోక్యానాయక్ ఎమ్ ఎల్ హెచ్ పి నందిని ఏఎన్ఎం దివ్యవాణి ఆశా కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

