Homeఆంధ్రప్రదేశ్తూర్పు గోదావరిమహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..!

మహాకుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు..!

2027 పుష్కరాలకు రూ.8,500 కోట్ల అంచనా వ్యయం..

అత్యాధునిక సాంకేతికతతో భక్తులకు మహా ఆధ్యాత్మిక అనుభూతి

 

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా తరహాలో 2027 గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ముమ్మరం చేస్తోంది. కోట్లాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని ఆధునిక సాంకేతికత, విస్తృత మౌలిక వసతులు, భద్రత, పారిశుధ్యంతో పుష్కరాలను నిర్వహించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమవుతోంది.

రూ.8,500 కోట్లతో భారీ ప్రణాళిక

రాజమండ్రి, పెన్ పవర్, ఆగస్టు 13:

గోదావరి పుష్కరాలను ఈసారి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దక్షిణాది మహాకుంభమేళాగా భావించే ఈ ఆధ్యాత్మిక వేడుకకు దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

2027 గోదావరి పుష్కరాల కోసం మొత్తం అంచనా వ్యయం సుమారు రూ.8,500 కోట్లుగా నిర్ణయించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. తొలి విడతలో మౌలిక వసతులు, పుష్కర ఘాట్ల అభివృద్ధి తదితర పనుల కోసం రూ.530 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. పుష్కరాల అవసరాలను బట్టి శాఖల వారీగా నిధులను కేటాయిస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు.

238 ఘాట్లకు మహర్దశ

గోదావరి తీరంలో భక్తుల రద్దీని తట్టుకునేలా పాత, కొత్తగా ఏర్పాటు చేయనున్న మొత్తం 238 పుష్కర ఘాట్లను ఆధునీకరించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఘాట్ల మరమ్మతులు, విస్తరణ, కొత్త నిర్మాణాలు, భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు నీటిపారుదల శాఖకు రూ.210.06 కోట్లు కేటాయించినట్లు సమాచారం. పట్టణ మౌలిక వసతులు, పారిశుధ్య నిర్వహణ కోసం పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు రూ.150 కోట్లు, గోదావరి తీర ప్రాంతాల్లో నిరంతర విద్యుత్ సరఫరా, అవసరమైన తాత్కాలిక విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు ఇంధన శాఖకు రూ.100 కోట్లు కేటాయించారు.

ఆలయాలు, పర్యాటక ప్రాంతాలకు కొత్త రూపు

పుష్కరాల సమయంలో భక్తులు నదీస్నానంతో పాటు ప్రముఖ ఆలయాలను సందర్శించే అవకాశం ఉండటంతో దేవాలయాల సుందరీకరణ, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు దేవాదాయ శాఖకు రూ.60 కోట్లు కేటాయించారు. పర్యాటక సేవలు, సాంస్కృతిక కార్యక్రమాలు, కళా ప్రదర్శనల అభివృద్ధికి పర్యాటక, సాంస్కృతిక శాఖకు రూ.10 కోట్లు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. గోదావరి తీర ప్రాంతాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.

కృత్రిమ మేధతో భక్తుల రద్దీ నియంత్రణ

ఈసారి గోదావరి పుష్కరాల్లో డిజిటల్ సాంకేతికతను విస్తృతంగా వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఘాట్లకు చేరుకునే పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ ఆధారిత సీసీ కెమెరాల నెట్‌వర్క్, డ్రోన్ నిఘా వ్యవస్థ, రియల్‌టైమ్ కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. భక్తులు ముందుగానే తాము వెళ్లాలనుకునే ఘాట్‌, అందుబాటులో ఉన్న పార్కింగ్‌ ప్రాంతాలు, ట్రాఫిక్‌ మార్గాలు, అత్యవసర వైద్య సేవల వివరాలను తెలుసుకునేలా ప్రత్యేక మొబైల్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. క్యూఆర్‌ కోడ్‌ ఆధారిత నావిగేషన్‌ వ్యవస్థ ద్వారా ఘాట్లు, పార్కింగ్‌ ప్రదేశాలు, ఇతర ముఖ్య ప్రాంతాలను సులభంగా గుర్తించే సదుపాయం కల్పించనున్నారు.

భద్రత.. వైద్యం.. పారిశుధ్యానికి పెద్దపీట

పుష్కరాల సమయంలో నది నీరు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు ప్లాస్టిక్‌ వినియోగాన్ని నియంత్రించి పర్యావరణహిత పుష్కరాలుగా నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రతి పుష్కర ఘాట్‌ వద్ద 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా మొబైల్‌ మెడికల్‌ బృందాలు, అంబులెన్సులు, పారిశుధ్య సిబ్బంది, శిక్షణ పొందిన ఈత నిపుణులను అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన కోసం కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ కేంద్రాలను అనుసంధానం చేయనున్నారు.

గోదావరి తీరం.. ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త చిరునామా

రాజమహేంద్రవరం, కోవూరు, నరసాపురం, భద్రాచలం పరిసర ప్రాంతాల్లోని గోదావరి తీరాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు కేవలం నదీస్నానం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకే పరిమితం కాకుండా సురక్షితమైన, సౌకర్యవంతమైన పర్యాటక అనుభూతిని అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. భక్తుల రద్దీ, ట్రాఫిక్‌ నిర్వహణ, పారిశుధ్యం, వైద్య సేవలు, భద్రత, విద్యుత్‌, తాగునీరు వంటి అన్ని అంశాలను సమన్వయంతో నిర్వహించేందుకు శాఖల మధ్య సమన్వయం కీలకం కానుంది. భారీ స్థాయిలో జరిగే ఈ మహా ఆధ్యాత్మిక వేడుకకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తుండటంతో 2027 గోదావరి పుష్కరాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular