గార్ల, పెన్ పవర్, ఆగస్టు 19:
ఫోటోగ్రఫీ వృత్తి మాత్రమే కాదని కాలాన్ని, చరిత్రను, జ్ఞాపకాలను పదిలపరిచే అద్భుతమైన కళ అని ఫోటోగ్రాఫర్ల సంఘం మండల అధ్యక్షుడు బల్లెం దుర్గాప్రసాద్ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గార్ల మండల కేంద్రంలో మండల ఫోటోగ్రఫీ అసోసియేషన్ కోశాధికారి రావూరి ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత ఫోటోగ్రఫీ పితామహుడు లూయిస్ మండే డాగురే ను స్మరించుకుంటూ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి ఫోటోగ్రఫీ జెండాను ఆవిష్కరించారు.విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమర ఫోటోగ్రాఫర్ల సేవలను గుర్తు చేసుకొని వారికి నివాళులర్పించారు. అనంతరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో చోటుచేసుకునే ముఖ్యమైన సంఘటనలను కెమెరాలో బంధించి భవిష్యత్ తరాలకు అందిస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలు విలువైనవని పేర్కొన్నారు.ఎండ, వాన, రాత్రి, పగలు అనే తేడా లేకుండా విధులు నిర్వహిస్తూ ప్రజలకు సమాచారాన్ని చేరవేయడంలో ఫోటోగ్రాఫర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వృత్తిలో ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఫోటోగ్రాఫర్లంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ కార్యదర్శి శ్రీరామ్ జిల్లా నాయకులు బెల్లం కిరణ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి మండల నాయకులు మహేష్ జంజిరాల భాస్కర్ అనుగోజు నాగబాబు ఎజాస్ వీరు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

