చీరాల, సెప్టెంబర్ 30: చీరాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 94 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన రూ.64,40,521 విలువైన చెక్కులను ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అందజేశారు. వైద్య చికిత్స కోసం వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఖర్చు చేసిన బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందన్నారు. వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు వైద్య ఖర్చులకు సంబంధించిన నగదు రసీదులతో ముఖ్యమంత్రి సహాయనిధికి దరఖాస్తు చేసుకుంటే, పరిశీలన అనంతరం అర్హత మేరకు ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ మెరుగైన సమాజ నిర్మాణం లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్యకు లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కౌతరపు జనార్ధన్, నియోజకవర్గ పట్టణ, గ్రామ పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

