గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు
రంపచోడవరం, పెన్ పవర్, అక్టోబర్ 01:
రంపచోడవరం సబ్ డివిజన్ పరిధిలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా చర్యలు చేపడతామని నూతన సబ్ కలెక్టర్ డి. పృథ్వీరాజ్ కుమార్ తెలిపారు.
రంపచోడవరం నూతన సబ్ కలెక్టర్గా డి. పృథ్వీరాజ్ కుమార్ గురువారం ఉదయం 10 గంటలకు సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. రెవెన్యూ శాఖకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వ నిబంధనల మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
యూపీఎస్సీ–2023లో 493వ ర్యాంకు సాధించిన డి. పృథ్వీరాజ్ కుమార్ 2024 బ్యాచ్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. గతంలో శ్రీకాకుళం జిల్లాలో అసిస్టెంట్ కలెక్టర్గా శిక్షణ పొందినట్లు తెలిపారు.
పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్, జాయింట్ కలెక్టర్ సూరపాటి ప్రశాంత్ కుమార్ ఆదేశాలు, సూచనలను పాటిస్తూ రంపచోడవరం డివిజన్లో ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తామని సబ్ కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ప్రభుత్వ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపడతామని తెలిపారు.
బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా డివిజన్ పరిధిలోని ఎనిమిది మండలాలకు చెందిన తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సబ్ కలెక్టర్ కార్యాలయ సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సబ్ కలెక్టర్కు ఘనంగా స్వాగతం పలికారు.
కార్యక్రమంలో తహసీల్దార్లు సీహెచ్. బాలాజీ, ఎ. సత్యనారాయణ, స్వామి, సీహెచ్. శ్రీనివాసరావు, అమ్మాజీ, తేజస్విని, రామచంద్రరావు, శ్రీరాములు, సబ్ కలెక్టర్ కార్యాలయ ఏవో ఎ. సత్యనారాయణ, డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్, సీనియర్ సహాయకులు డి. ఇందిరాబాయి, అలెగ్జాండర్, యూనిస్, రామకృష్ణ, అశోక్, దాసు తదితరులు పాల్గొన్నారు.

