విద్యార్థులు పట్టుదలతో చదివి ఉపకార వేతనాలకు అర్హత సాధించాలి
రాజవొమ్మంగి, పెన్ పవర్: అక్టోబర్ 10
పోటీ పరీక్షల్లో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించి, ప్రతిభా ఉపకార వేతనాలకు అర్హత పొందాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాజవొమ్మంగి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ప్రతిభా ఉపకార వేతన పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)కు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత అధ్యయన సామగ్రిని పంపిణీ చేశారు.
విద్యార్థులకు పరీక్షల సన్నద్ధతలో అవసరమైన పుస్తకాలు, అధ్యయన సామగ్రి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అందుబాటులో ఉన్న విద్యా వనరులను సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో చదువుతూ నిరంతరం సాధన చేయాలని విద్యాశాఖ అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు సూచించారు. క్రమబద్ధమైన అధ్యయనం, పట్టుదలతో పరీక్షలకు సిద్ధమైతే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు.
పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బి. శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి కారం వీర వెంకట సత్యనారాయణ దొర, పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు ఆరుమిల్లి ఆదిలక్ష్మి, జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు తీగల బొజ్జియ్య, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయుడు శివకృష్ణ పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థుల ప్రతిభను వెలికితీసేందుకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి తోడ్పాటు అందించేందుకు ఉచితంగా అధ్యయన సామగ్రిని పంపిణీ చేసిన జన విజ్ఞాన వేదికకు పాఠశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది.

