Homeఆంధ్రప్రదేశ్అనకాపల్లియువత గల్లీ గొడవలు వదిలి రాజకీయాల్లోకి రావాలి

యువత గల్లీ గొడవలు వదిలి రాజకీయాల్లోకి రావాలి

రాజ్యసభ సభ్యులు చింతకాయల  విజయ్ పిలుపు

నర్సీపట్నంలో ఘనంగా ‘యువతరం మన భవిష్యత్తు’ కార్యక్రమం..

300 మంది యువతతో సదస్సు…

​నర్సీపట్నం, పెన్ పవర్ :

యువత గల్లీల్లో చిన్నపాటి గొడవలకు వెళ్లి తమ బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని, దానికి బదులుగా రాజకీయాల్లోకి వచ్చి చట్టాలు చేసే స్థాయికి ఎదగాలని రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ పిలుపునిచ్చారు. నర్సీపట్నం బలిఘట్టం 25వ వార్డు అభ్యర్థి యువ నాయకుడు గవిరెడ్డి లక్ష్మి గణేష్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది యువతతో “యువతరం మన భవిష్యత్తు” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ చింతకాయల విజయ్ హాజరయ్యారు. సమావేశంలో యువతను ఉద్దేశించి ఎంపీ విజయ్ మాట్లాడుతూ.. పనులను రేపు చేద్దాంలే అని వాయిదా వేసే అలవాటును యువత ముందుగా మానుకోవాలని సూచించారు. ఏదైనా ఒక మంచి పనిని లేదా వ్యాయామాన్ని 22 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తే, అది మన మెదడుకు శాశ్వత అలవాటుగా మారిపోయి సక్సెస్ వైపు నడిపిస్తుందని ఆయన వివరించారు.

​యువత రాజకీయాల్లోకి వచ్చి గెలిస్తేనే రాష్ట్రాభివృద్ధి, మన భవిష్యత్తు బాగుంటుందని నేతలు స్పష్టం చేశారు. యువత కేవలం ఓటర్లుగా మిగిలిపోకుండా, ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుని పాలసీలు రూపొందించే నాయకులుగా ఎదగాలని ఎంపీ ఆకాంక్షించారు. నర్సీపట్నం మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా ఎంతో అనుభవం ఉన్న పద్మావతి గారు అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని ఈ సందర్భంగా నాయకులు ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా 25వ వార్డు కౌన్సిలర్ గా యువకుడు విద్యావంతుడు గణేష్ పోటీలో ఉన్నారు అత్యధిక మెజారిటీతో తనను గెలిపించి వార్డు అభివృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరారు. ​యువత అడిగిన పలు ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్పిన ఎంపీ చింతకాయల విజయ్, నర్సీపట్నం అభివృద్ధికి సంబంధించి పలు కీలక హామీలు ఇచ్చారు. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే యువతకు ఉపయోగపడేలా నర్సీపట్నంలో పుస్తకాలు, ఫ్రీ వైఫై వసతులతో కూడిన అత్యుత్తమ లైబ్రరీని నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ లైబ్రరీ భవనం పై అంతస్తులోనే యువత తమ భవిష్యత్ ప్రణాళికలు, స్టార్టప్ ఐడియాలను చర్చించుకోవడానికి (బ్రెయిన్ స్టార్మింగ్) వీలుగా ఒక ప్రత్యేక కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేస్తామన్నారు. యువత ఫిట్‌నెస్, ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి వీలుగా నర్సీపట్నంలో ఒక ‘ఓపెన్ జిమ్’ను ఏర్పాటు చేయాలని ఒక యువతి కోరగా, తప్పకుండా ఏర్పాటు చేస్తామని ఆయన సానుకూలంగా స్పందించారు. యువత కార్పొరేట్ ఇంటర్వ్యూలు ఎదుర్కోవడానికి అవసరమైన కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికాసం నేర్పించడానికి మేధా చిరంజీవి లాంటి నిపుణులతో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. నర్సీపట్నాన్ని నేరాలు లేని (జీరో క్రైమ్) ప్రాంతంగా మార్చడంలో యువత ముందుండాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావడానికి ప్రత్యేక వాట్సాప్ నెంబర్ ద్వారా పబ్లిక్ గ్రీవెన్స్ విధానాన్ని అందుబాటులోకి తెస్తామని చెప్పారు. దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని చెప్పడానికి ఉదాహరణగా  రాబోయే రోజుల్లో మన పెద్ద చెరువు లో కట్టబోయే పద్మంలో కొలువై ఉండే పార్వతీ పరమేశ్వరుల విగ్రహాల నిర్మాణం తో నర్సీపట్నం ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుతుందని ఆయన యువతకు వివరించి స్ఫూర్తి నింపారు. ఏ పనైనా అంకితభావంతో చేస్తే విజయం తథ్యమని ఎంపీ విజయ్ ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, బలిఘట్టం నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular