కార్తీక పౌర్ణమి సందర్భంగా చింతపల్లి స్టేజి వద్ద భక్తుల సందడి
పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్న భక్తులు
కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం
ఖమ్మం , పెన్ పవర్, నవంబర్ 24:
కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం రూరల్ మండలం చింతపల్లి స్టేజి వద్ద భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టకు పాలు పోసి తమ మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకున్నారు.
చింతపల్లి స్టేజి వద్ద ఉన్న పుట్టను భక్తులు కొంగుబంగారంగా భావిస్తారు. ఇక్కడ పుట్టకు పాలు పోసి నాగదేవతను ప్రార్థిస్తే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నాగుల చవితి నుంచి కార్తీక పౌర్ణమి వరకు భక్తులు ఇక్కడికి చేరుకుని పాలు పోస్తూ, ప్రత్యేక పూజలు చేస్తూ తమ మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా కొనసాగుతోంది.
కార్తీక పౌర్ణమి చివరి రోజున కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో చింతపల్లి స్టేజి వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

