కొత్త విద్యా సంవత్సరం దగ్గరపడుతుండగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల భారం తల్లిదండ్రుల్లో కొత్త ఆందోళన రేపుతోంది. ప్రతి ఏడాది 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచుతున్నా విద్యాశాఖ కట్టడి చేయడంలో విఫలమవుతోందన్న విమర్శలు పెరుగుతున్నాయి.ఫీజుల నియంత్రణకు డ్రాఫ్ట్ బిల్లు సిద్ధమైనప్పటికీ ఇంకా స్పష్టమైన చట్టం రాకపోవడం ప్రశ్నలు లేవనెత్తుతోంది.మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలపై ఈ భారం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని సృష్టిస్తోంది.ఇప్పటికైనా ప్రత్యేక చట్టంతో ఫీజుల దోపిడీకి కళ్లెం వేయాలన్న డిమాండ్ బలపడుతోంది.
- కొత్త విద్యాసంవత్సరం ముందే ఫీజుల షాక్
- 20–30% పెంపుతో పేరెంట్స్‌పై భారీస్థాయి భారం
- డ్రాఫ్ట్ బిల్లు సిద్ధం.. అమలు మాత్రం పెండింగ్
- కార్పొరేట్ స్కూళ్ల అదనపు ఛార్జీల దోపిడీ
- ఫీజుల నియంత్రణకు ప్రత్యేక చట్టం డిమాండ్
నల్గొండ – వరంగల్ | పెన్ పవర్ | ఏప్రిల్ 3:
జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల పెంపుపై తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే పలు పాఠశాలలు వచ్చే ఏడాదికి 20 నుంచి 30 శాతం వరకు ఫీజులు పెంచనున్న సంకేతాలు ఇస్తుండటంతో మధ్యతరగతి కుటుంబాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా ఫీజుల నియంత్రణ విషయంలో మాత్రం స్పష్టమైన విధానం కనిపించకపోవడం విమర్శలకు దారితీస్తోంది. తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ ఇప్పటికే ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం ప్రత్యేక డ్రాఫ్ట్ బిల్లును ప్రభుత్వానికి సమర్పించినా, అది ఇంకా చట్టరూపం దాల్చలేదు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా నిబంధనలు ఉల్లంఘించే స్కూళ్ల గుర్తింపును రద్దు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు పాఠ్యపుస్తకాలు, ప్రత్యేక కార్యక్రమాలు, ఒలింపియాడ్ కోచింగ్, టెక్నో–గ్లోబల్ ప్యాకేజీల పేరుతో అదనపు ఫీజులు వసూలు చేస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కొన్ని స్కూళ్లలో ఒకే తరగతికి రూ.30 వేల వరకు అదనపు పెంపు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.విద్యను వ్యాపారంగా మార్చే ధోరణి పెరుగుతున్న నేపథ్యంలో, ఫీజుల నిర్మాణం పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసి, ప్రతి పెంపుపై పర్యవేక్షణ చేయాలని విద్యావేత్తలు డిమాండ్ చేస్తున్నారు. “అందరికీ నాణ్యమైన విద్య” అన్న నినాదం వాస్తవ రూపం దాల్చాలంటే ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిందేనని పేరెంట్స్ స్పష్టం చేస్తున్నారు.

