బాధిత కుటుంబాలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి
-స్పీకర్ అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, పెన్ పవర్ :
ప్రజల కష్టసుఖాల్లో తోడుగా నిలవడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ఆదివారం నర్సీపట్నంలోని స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన పలువురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఒకే రోజు నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన 22 మంది లబ్ధిదారులకు మొత్తం రూ. 7,28,729 విలువైన చెక్కులను ఆయన అందజేశారు. ఇందులో గొలుగొండ మండలానికి 6, మాకవరపాలెం 3, నాతవరం 6, నర్సీపట్నం మండలం మరియు మున్సిపాలిటీకి సంబంధించి 7 చెక్కులు ఉన్నాయి.

ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద కుటుంబాలకు ఆపద సమయంలో కొండంత అండగా నిలుస్తోందని అన్నారు. గత ఏడాది కాలంలో నర్సీపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 184 మందికి పైగా లబ్ధిదారులకు రూ. 1,73,62,000 ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారికి ఈ నిధులు ఎంతో ఊరటనిస్తున్నాయని, భవిష్యత్తులోనూ ప్రతి అర్హుడికి ప్రభుత్వం నుండి సహాయం అందేలా నిరంతరం కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాకవరపాలెం మండలపార్టీ అద్యక్షుడు ఆర్.వై.పాత్రుడు, దుంగలవానిపాలెం సర్పంచ్ దుంగల వెంకటరమణ, వబ్బలరెడ్డి గోవిందు, నర్సీపట్నం జడ్పీటిసి సుకల రమణమ్మ, మండల టిడిపి అద్యక్షుడు సుకల అప్పలనాయుడు, లాలం గోవిందు, తాండవ ప్రాజెక్ట్ ఛైర్మన్ కరక సత్యన్నారయణ, నందిపల్లి వెంకటరమణ, నియోజకవర్గంలోని వివిధ మండలాల నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు మరియు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.

