ప్రత్యేక అధికారిని సన్మానించిన జనసేన నాయకులు
గూడెం కొత్తవీధి,పెన్ పవర్,ఏప్రిల్ 20:రింతాడ పంచాయితీకి నూతనంగా నియమితులైన స్పెషల్ ఆఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ జేఈ కళ్యాణ్‌రావును సోమవారం జనసేన పార్టీ నాయకులు ఘనంగా కలుసుకున్నారు. జీకే వీధి మండల అధ్యక్షుడు కొయ్యం బాలరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఆయనకు దూసాలువతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా పంచాయితీ అభివృద్ధి, ప్రజల సమస్యల పరిష్కారంలో సమన్వయంతో పనిచేయాలని కోరారు. రింతాడ పంచాయితీ పరిధిలోని పలు గ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకువెళ్లారు. వేసవి తీవ్రత నేపథ్యంలో తాగునీటి కొరత అధికంగా ఉందని, బోర్లు ఎండిపోవడం, నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు.తక్షణ చర్యలు తీసుకుని ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా పెంచడం, చెడిపోయిన బోర్లను మరమ్మతు చేయడం, అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వించడం వంటి చర్యలు చేపట్టాలని వినతిపత్రం సమర్పించారు. అలాగే రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, విద్యుత్ వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి, గ్రామాల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ అరుణ్‌కుమార్, జనసేన పంచాయితీ అధ్యక్షుడు కొయ్యం ఇమ్మానుయేల్, సిద్దు, శోభారాణి (బీజేపీ), గుంట కోటి, పాంగి కృష్ణ, పేసా కార్యదర్శి కొర్ర రాజు, జనసేన యువత అధ్యక్షుడు కొర్ర సీతన్న, సిదేరి సురేష్, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ కళ్యాణ్‌రావు ప్రజల సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

