పాడే మోసి కడసారి వీడ్కోలు పలికిన మంత్రి సుభాష్
రామచంద్రపురం, పెన్ పవర్, ఏప్రిల్ 14:
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చింతపల్లి వీరభద్రరావు అకాల మరణం పట్ల రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.మరణ వార్త తెలిసిన వెంటనే మంత్రి సుభాష్ స్వగ్రామమైన హసనాబాద్‌కు చేరుకుని వీరభద్రరావు భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్పు తెలిపారు. ఈ కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.అనంతరం వీరభద్రరావు పార్థివ దేహంపై తెలుగుదేశం పార్టీ కండువాను కప్పి ఘనంగా అంతిమ వీడ్కోలు పలికారు. పాడే మోసి కడసారి వీడ్కోలు ఇవ్వడం ద్వారా తన గాఢమైన గౌరవాన్ని చాటుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ వీరభద్రరావు మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. పార్టీ అభివృద్ధికి, ప్రజాసేవకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు.ఈ కార్యక్రమంలో టిడిపి రూరల్ మండలం అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనుబాబు, గంగవరం మండల అధ్యక్షులు మేడిశెట్టి రవికుమార్, బలుసు శివప్రసాద్, కోట తాతబ్బాయి, టేకుమూడి సత్యనారాయణ, నియోజకవర్గ కూటమి పార్టీ నాయకులు పాల్గొని సంతాపం తెలిపారు.

