ePaper
Saturday, April 25, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాకినాడమండలంలో డీజిల్ కొరత కలకలం

మండలంలో డీజిల్ కొరత కలకలం

📰 Generate e-Paper Clip

కృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయం ఆరోపణలు

ఆక్వా రైతులు, వ్యవసాయదారులు తీవ్ర ఇబ్బందులు

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

కాజులూరు, పెన్ పవర్,ఏప్రిల్ 24:
మండల పరిధిలోని కాజులూరు, గొల్లపాలెం,శలపాక ప్రాంతాల్లో డీజిల్ కొరత తీవ్రంగా మారింది. హెచ్‌పీ, ఇండియన్ పెట్రోల్ బంకుల్లో కృత్రిమంగా కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వాహనదారులు, రైతులు బంకుల వద్ద భారీగా క్యూలు కడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఒక వైపు డీజిల్ కొరత, మరోవైపు కరెంట్ కోతలు ఆక్వా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో జనరేటర్లపై ఆధారపడాల్సి వస్తోందని, కానీ డీజిల్ అందుబాటులో లేకపోవడంతో ఆక్వా చెరువులు ప్రమాదంలో పడుతున్నాయని రైతులు వాపోతున్నారు.లక్షల రూపాయలు ఖర్చు చేసి ఆక్వా సాగు చేస్తున్న రైతులు ఇప్పుడు నష్టాల భయంతో కన్నీటి పర్యంతం అవుతున్నారు. “సమయానికి కరెంట్ లేదు… డీజిల్ లేదు… మా పరిస్థితి ఏమవుతుంది?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇక వ్యవసాయ రంగంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పంటలు కోతకు సిద్ధంగా ఉన్నా కోత యంత్రాలకు డీజిల్ దొరకక రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఈ సమయంలో వర్షాలు కురిస్తే పరిస్థితి మరింత విషమమవుతుందని భయపడుతున్నారు. ఇదిలా ఉండగా, ప్రభుత్వం మాత్రం జిల్లాలో ఎక్కడా డీజిల్ కొరత లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని ప్రకటించడం రైతుల్లో ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. నేలమీద పరిస్థితి వేరుగా ఉండగా అధికారుల ప్రకటనలు వాస్తవానికి విరుద్ధంగా ఉన్నాయని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పెట్రోల్ బంకుల వద్ద రోజురోజుకు క్యూలు పెరుగుతున్నా, అధికారుల స్పందన మాత్రం కనిపించకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృత్రిమ కొరతపై చర్యలు తీసుకుని, తక్షణమే డీజిల్ సరఫరా సాధారణ స్థితికి తీసుకురావాలని రైతులు, వాహనదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular