సి సి ఫుటేజ్ బయట పెట్టిన డి ఎస్ పి శ్రీనివాసరావు
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం రూరల్ ఎస్సై రాజారావుపై శనివారం మధ్యాహ్నం మాజీ ఎమ్మెల్యే గణేష్ చేసిన ఆరోపణలన్నీ సత్య దూరమని డిఎస్పి శ్రీనివాసరావు ఖండించారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఓ వీడియో విడుదల చేశారు. రూరల్ ఎస్సై రాజారావు నిజాయితీపరుడని, అన్యాయంగా అతనిపై ఆరోపణలు చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు. అప్పన్నపాలెంకు చెందిన సుర్ల నూకరాజుకు సంబంధించిన సీసీ ఫుటేజ్ ను చూపిస్తామని, అనుమానాలు ఉంటే తమ కార్యాలయానికి రావచ్చని అన్నారు. డి.ఎస్.పి పిలుపుమేరకు ఆదివారం ఉదయం 11 గంటలకు మీడియాతో సహా మాజీ ఎమ్మెల్యే గణేష్ డి.ఎస్.పి కార్యాలయానికి చేరుకున్నారు. మీడియా సమక్షంలో నూకరాజును స్టేషన్ కు తీసుకువచ్చిన నిమిషం నుండి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించారు. నూకరాజు కాలికి తగిలిన గాయం ఏ విధంగా జరిగింది అన్నది కళ్ళకు కట్టినట్లు చూపించారు. మాజీ ఎమ్మెల్యే ఆరోపించినట్లు లాఠీలకు జండూబామ్ రాసి కొట్టడం, బూటు కాళ్లతో తన్నడం, విచక్షణారహితంగా కొట్టడం లాంటివి జరగలేదని మీడియాకు తెలిపారు. ఎవ్వరి పైన తమకు వ్యక్తిగత కక్షలు ఉండవని, విధి నిర్వహణలో భాగంగానే స్టేషన్ కు తీసుకు రావడం, కౌన్సిలింగ్ చేయడం, అవసరమైతే కేసు నమోదు చేసి కోర్టుకి తరలించడం జరుగుతుందన్నారు. పూర్తి సమాచారం తెలుసుకోకుండా మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

