పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేటను అభివృద్ధి చేస్తామన్న అయ్యన్నపాత్రుడు
నర్సీపట్నం, పెన్ పవర్ :
మన్యం వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి శ్రీరామరాజు 129వ జయంతి వేడుకలను నర్సీపట్నంలో ఘనంగా నిర్వహించారు. క్షత్రియ పరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సెంటర్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ చిన్న వయసులోనే గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న అన్యాయాలపై స్పందించి బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహావీరుడు అల్లూరి అని కొనియాడారు. ఆయన త్యాగాలను, పోరాట స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అల్లూరి భౌతికకాయాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించిన కృష్ణదేవిపేటలో అల్లూరి సమాధి ఉందని, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించేలా జీవో ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం కృష్ణదేవిపేటలో అల్లూరి శ్రీరామరాజు పార్కును అభివృద్ధి చేశామని, క్షత్రియ సోదరుల సహకారంతో అక్కడ పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశామని అయ్యన్నపాత్రుడు తెలిపారు. కేడీపేటను గొప్ప పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఎంపీలు, ఇతర పెద్దలు ఆర్థికంగా అండగా నిలుస్తున్నారని తెలిపారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనులకు కనీస కూలీ ఇవ్వకుండా, పోడు వ్యవసాయం చేసుకోనివ్వకుండా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను ఎదుర్కొని, అహింసా మార్గంలో వినని ఆంగ్లేయులను వారి తుపాకులతోనే కాల్చి చంపిన గొప్ప ధీరుడు అల్లూరి అని కొనియాడారు. నర్సీపట్నంలో అల్లూరి విగ్రహాన్ని, సెంటర్‌ను ఏర్పాటు చేసిన క్షత్రియ పరిషత్ సభ్యులను, ఇందుకు ప్రోత్సాహం అందించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడిని ఆయన అభినందించారు. నేటి తరానికి, పిల్లలకు అల్లూరి చరిత్ర తెలిసేలా పాఠ్యాంశాల్లో ఆయన పోరాట ఘట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందని, ఈ దిశగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవ తీసుకోవాలని కొణతాల రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ దాట్ల సూర్యనారాయణరాజు, పట్టణ ప్రముఖులు గణపతిరాజు సూర్య బంగార్రాజు, జంపన నాగేంద్రరాజు, జనసేన నియోజకవర్గం ఇన్చార్జ్ రాజాన సూర్యచంద్ర, క్షత్రియ పరిషత్ సభ్యులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

