భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K పోస్టర్‌ను ఆవిష్కరించిన కలెక్టర్
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, జూలై 29 : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో జూలై 31న నిర్వహించనున్న “భోగాపురం ఎయిర్‌పోర్ట్ రన్–5K” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎం. అబిషేక్ కిషోర్ బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి (DSDO) శ్రీమతి జూన్, కోచ్‌లు వి. దాస్, వైకుంఠ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపే ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు అని అన్నారు. ఈ విమానాశ్రయం ద్వారా ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి అవకాశాల పెరుగుదల, పర్యాటక రంగ విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణతో పాటు అంతర్జాతీయ అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల కలలకు రెక్కలు తొడిగే ప్రాజెక్టుగా భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిలవనుందని చెప్పారు.
ప్రజలను ఈ అభివృద్ధిలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో జూలై 31న ఉదయం 5.45 గంటలకు పార్క్ హోటల్ నుంచి తేనేటి పార్క్ వరకు 5 కిలోమీటర్ల రన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విశాఖపట్నం గ్లోబల్ గేట్‌వేగా ఎదుగుతున్న ఈ చారిత్రక సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ రన్‌లో పాల్గొనడానికి ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, వయోపరిమితి కూడా లేదని కలెక్టర్ తెలిపారు. పురుషులు, మహిళలు, విద్యార్థులు, యువత, క్రీడాకారులు, ఫిట్‌నెస్ అభిమానులు సహా అన్ని వయస్సుల వారు పాల్గొనవచ్చని పేర్కొన్నారు.
జిల్లా క్రీడాభివృద్ధి అధికారి శ్రీమతి జూన్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని క్రీడా సంఘాల ప్రతినిధులు, కోచ్‌లు, శారీరక విద్య ఉపాధ్యాయులు, విద్యార్థులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని రన్‌ను విజయవంతం చేయాలని కోరారు.

