Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశం

ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశం

భోగాపురం పర్యటనను సమన్వయంతో విజయవంతం చేయాలి

ప్రధాని పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డోలా ఆదేశం

 బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్          విశాఖపట్నం, జూలై 29 : ఆగస్టు 1న భారత ప్రధానమంత్రి భోగాపురం పర్యటనతో పాటు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా విజయవంతం చేయాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అధికారులకు ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ రవాణా, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, వైద్య సేవలు, భద్రత తదితర అంశాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షకు ప్రతిరూపంగా రూపుదిద్దుకున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఈ ప్రాంత అభివృద్ధి చరిత్రలో ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. ఈ మహా కార్యక్రమంలో ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, తాగునీరు, ఆహారం, వైద్య సేవలు, భద్రతతో పాటు రవాణా ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి, అవన్నీ ఉదయం 9 గంటలలోపు భోగాపురం చేరుకునేలా ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గ్రామం, మండలం, రూట్‌వారీగా బాధ్యతలను కేటాయించి అధికారులు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని తెలిపారు.

బస్సుల రూట్ మ్యాప్, సమయాలు, ప్రయాణ వివరాలను ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని, ప్రజల సాధారణ రాకపోకలకు ఆటంకం కలగకుండా ప్రత్యేక ట్రాఫిక్ ప్రణాళిక అమలు చేయాలని మంత్రి ఆదేశించారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రావడంతో ఉత్తరాంధ్రలో ఉపాధి, పెట్టుబడులు, పర్యాటకం, వ్యాపారం, విమానయాన రంగాల్లో విస్తృత అవకాశాలు ఏర్పడనున్నాయని పేర్కొన్న మంత్రి, ఈ అవకాశాలపై యువతకు, ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా చేపట్టాలని సూచించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి రావు, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, కార్పొరేషన్ చైర్మన్లు సీతంరాజు సుధాకర్, గండి బాబ్జి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular