Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంపాత పెన్షన్ కోసం విద్యుత్ ఉద్యోగుల పోరాటం ముమ్మరం

పాత పెన్షన్ కోసం విద్యుత్ ఉద్యోగుల పోరాటం ముమ్మరం

పల్లా శ్రీనివాసరావుకు ఏపీఈఈయూ-1104 వినతి..

సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు

విశాఖపట్నం, పెన్ పవర్  జూలై 21 :

 

రెండు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పాత పెన్షన్ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగుల సంఘం (APEEU-1104) తన ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసింది. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 వరకు విద్యుత్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానం (OPS) వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సంఘం ప్రతినిధులు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావును కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ.ఎం.ఎస్. నెం.53 ద్వారా అర్హత కలిగిన ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో, అదే న్యాయాన్ని విద్యుత్ సంస్థల ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని సంఘం కోరింది. ఉద్యోగుల మధ్య వివక్షను తొలగించి, చాలాకాలంగా కొనసాగుతున్న చారిత్రక అన్యాయాన్ని సరిదిద్దాలని విజ్ఞప్తి చేసింది.


వినతిపత్రాన్ని స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు సమస్యపై సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఆర్థిక శాఖ మంత్రి, విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, ఉద్యోగులకు న్యాయం జరిగేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ, ఏపీఈఈయూ-1104 ఇప్పటికే ముఖ్యమంత్రికి సమగ్ర వినతిపత్రం సమర్పించిందని తెలిపారు. 1999 ఫిబ్రవరి 1 నుంచి 2004 ఆగస్టు 31 మధ్యకాలంలో నియమితులైన వేలాది మంది విద్యుత్ ఉద్యోగులకు ఒకేసారి అవకాశం కల్పించి, ప్రస్తుతం అమలులో ఉన్న ఈపీఎఫ్ విధానం నుంచి పాత పెన్షన్ విధానంలోకి మారేందుకు అనుమతించాలని కోరినట్లు వెల్లడించారు. ఇది ఉద్యోగుల హక్కుతో పాటు వారి భవిష్యత్ సామాజిక భద్రతకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు.


ఈ కార్యక్రమంలో జోన్-2 బ్రాంచ్ అధ్యక్షుడు జె. అప్పలరాజు, కార్యదర్శి బుద్దా శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ పి. భాస్కరనాయుడు, డిస్కమ్ వైస్ ప్రెసిడెంట్ ఏదుర అప్పలరాజు, రీజినల్ అసిస్టెంట్ సెక్రటరీ డి. అప్పారావు, మాజీ కో-ఆపరేటివ్ డైరెక్టర్ ఏదుర అప్పలరాజు, కో-ఆపరేటివ్ డైరెక్టర్ ఎస్. హారనాథ్ బాబుతో పాటు జేఈలు, జేఎల్ఎంలు, జీపీఎఫ్ కోరుతున్న ఉద్యోగులు మరియు పెద్ద సంఖ్యలో విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని, జి.ఓ.ఎం.ఎస్. నెం.53 తరహాలో విద్యుత్ ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానం అమలు చేస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవాలని సంఘం నాయకులు విజ్ఞప్తి చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular