Homeఆంధ్రప్రదేశ్కాకినాడ"వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్"

“వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్”

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్‌గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్” (విబి జీ రామ్ జీ) పథకం జిల్లా స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం జగ్గంపేట మండలం రాజపుడి గ్రామంలో ఘనంగా జరిగింది. డ్వామా పీడీ ఎస్.మధుసుధన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ హాజరై, గ్రామంలోని నరసన్న చెరువుకు ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ విబి జీ- రామ్ జీ నూతన పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని శ్రామికుల సంక్షేమం కోసం గతంలో ఉన్న నరేగా (ఎన్ఆర్ఈజిఎస్) పథకం స్థానంలో కేంద్రం ప్రభుత్వం ‘వికసిత్ భారత్-జీ రామ్ జీ’ (విబి జీ రామ్ జీ) పేరుతో కొత్త పథకాన్ని నేటితో శ్రీకారం చుట్టిందన్నారు. ఈ ప్రధాన ఉద్దేశ్యం, ఉపాధి శ్రామికులకు ఏడాదిలో 125 రోజుల పాటు ఉపాధి కల్పించడం జరుగుతుందన్నారు. ఈ పథకం కింద వ్యవసాయ పనులు తక్కువగా ఉన్న సమయంలో కార్మికులకు ఉపాధి హామీ కల్పించడం, గ్రామీణ మౌలిక సదుపాయాలైన గ్రావెల్ రోడ్ల నిర్మాణం, అంగన్‌వాడీ భవనాల నిర్మాణం వంటి పనులను ప్రోత్సహించడం వంటి పనులు చేసుకునేందుకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ – జి రామ్ జి’ లక్ష్యాలను సాకారం చేసే దిశగా మనం ముందుకు సాగుతున్నామని ఇందులో భాగంగా, పేద ప్రజలకు 125 రోజుల వేతన ఉపాధి హామీని కల్పించడంతో పాటు, గ్రామసభల ద్వారా ‘వికసిత్ గ్రామ పంచాయత్ ప్రణాళిక’ (విజిపిపి)ని పకడ్బందీగా అమలు చేసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని పథకాలను ఒకే గొడుగు కిందకు తెచ్చేలా వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికతో అనుసంధానం చేయడమే కాకుండా నిర్ణీత సమయంలోనే వేతనాలు చెల్లించడం, ఒకవేళ ఆలస్యమైతే దానికి తగిన పరిహారం అందించడం ఈ పథకం ప్రధాన అంశమని ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిపాలనను మరింత పారదర్శకంగా, శక్తివంతంగా తీర్చిదిద్దుతాము. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మెరుగైన హామీ, దృఢమైన నిబద్ధతతో సమర్థ పాలనే మన వికసిత్ భారత్ యొక్క ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే తెలిపారు.

జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన ఉపాధిని కల్పించి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే ఈ విబీ జీ రామ్ జీ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజపూడిలోని నరసన్న చెరువు వంటి జలవనరుల అభివృద్ధి, ఈ పథకం ద్వారా చేపట్టే పనులు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయని, అర్హులైన వారందరికీ పథకం ఫలాలు పారదర్శకంగా అందేలా అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయ చేసుకుంటూ పర్యవేక్షించడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ నూతన పథకం అమలులో ఎటువంటి అవకతవకలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా పనులు జరుగుతాయని, నిధుల వినియోగం, నిర్దేశిత లక్ష్యాల సాధనపై అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ అభివృద్ధి పనుల్లో స్థానిక ప్రజలు, స్వయం సహాయక సంఘాలు చురుగ్గా పాల్గొని ఆర్థికంగా ఎదగాలని జేసీ కోరారు. అనంతరం గౌరీ శంకర్ కళ్యాణ మండపంలో తిరుపతిలో జరుగుతున్న విబి జీ- రామ్ జీ జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని జేసీ, ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు, ఉపాధి శ్రామికులు వీక్షించారు.

అనంతరం జగ్గంపేట మండలం జై కొత్తూరు గ్రామంలో జలధార జలహారతి కార్యక్రమం కింద చిన్నయ్యకు చేపట్టిన చెరువు పనులను జేసీ అపూర్వ భరత్, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు గట్టుమీద బ్లాక్ ప్లాంటేషన్ లో భాగంగా కొబ్బరి మొక్కలు నాటారు. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం కింద జే కొత్తూరు గ్రామానికి మంజూరైన ఇంటింటా చెత్త సేకరణ ట్రాక్టర్ ను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు.

కార్యక్రమంలో జగ్గంపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు, పెద్దాపురం డివిజన్ ఏపీడి ఎం.భాను ప్రకాష్, తహశీల్దార్ ఆర్. రమేష్, ఎంపీడీవో ఎవీఎస్. చంద్రశేఖర్, ఏపీవో ఆర్.గంగాభవాని ఇతర అధికారులు, విబి జీ రామ్ జీ శ్రామిక తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular