సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధుల ఆగ్రహం
వైద్యం నుంచి తాగునీరు, విద్యుత్ వరకు పలు అంశాలపై నిలదీత అధికారుల సమన్వయ లోపంపై అసంతృప్తి
గార్ల, పెన్ పవర్, ఆగస్టు 20:
గ్రామీణ ప్రాంతాల్లో ప్రజా సమస్యలకు సత్వర పరిష్కారం చూపేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పారదర్శకంగా విధులు నిర్వహించాలని మండల ప్రత్యేక అధికారి జి. దేశీరామ్ నాయక్ అన్నారు. గురువారం గార్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన సర్పంచులు, కార్యదర్శులు వివిధ శాఖల అధికారులతో ప్రత్యేక మండల సర్వసభ్య సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎంపీడీవో మంగమ్మ సమావేశాన్ని ప్రారంభించి, వివిధ శాఖల ప్రగతి, సమస్యలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.వ్యవసాయ శాఖ ఏఓ కావటి రామారావు మాట్లాడుతూ వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ, లాభదాయకమైన పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని సూచించారు. దీనిపై పెద్ద కిష్టాపురం సర్పంచ్ గంగావత్ రామ్‌సింగ్ నాయక్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సమస్యలను అధికారులు పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఉన్నతాధికారులతో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను ప్రజాప్రతినిధులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామ సభలకు అధికారులు ఎందుకు రావడం లేదు? గ్రామ సభలకు వివిధ శాఖల అధికారులు హాజరు కాకపోవడంపై రామ్‌సింగ్ నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను తెలుసుకునే గ్రామ సభలకు అధికారులు హాజరుకాకపోవడం సరికాదన్నారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడుతున్నప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు స్పందించడం లేదని విమర్శించారు. అధికారులు ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మర్రిగూడెం సర్పంచ్ రామ్‌సింగ్ నాయక్ మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు అవసరమైన ఎరువులను రాయితీపై అందించాలని, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటుకు సహకరించాలని, డ్రిప్ సిస్టమ్‌కు ప్రోత్సాహం కల్పించాలని కోరారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన సమస్యలపై ఉన్నతాధికారులకు నివేదికలు పంపి పరిష్కారానికి అధికారులు బాధ్యత వహించాలని అన్నారు.
గ్రామపంచాయతీలకు వైఫై సౌకర్యం కల్పించాలని, పాత పేసా కమిటీల స్థానంలో నూతన కమిటీలను ఏర్పాటు చేయాలనికోరారు. చిన్న బంజర సర్పంచ్ మోతీలాల్ మాట్లాడుతూ రైతులు కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలోనే వారికి అవసరమైన సహకారం అందించాలని కోరారు. పాఠశాలల సమస్యలపై ప్రశ్నలు సంధించిన సర్పంచులు విద్యాశాఖ నుండి ఎంఈఓ మంకిడి వీరభద్రరావు మాట్లాడుతూ మండలంలో రెండు ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించినట్లు తెలిపారు. పెద్దకిష్టాపురం పాఠశాలలోని అంగన్‌వాడీ అభ్యసన గదిని మరోచోటకు మార్చే అంశం సమావేశంలో చర్చకు వచ్చింది. పీఎం శ్రీ పథకం ప్రకారం మూడున్నరేళ్ల పిల్లలను పాఠశాల, అంగన్‌వాడీల్లో వేర్వేరుగా లెక్క చూపడంపై సర్పంచులు ప్రశ్నలు సంధించారు.వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి వైద్య శాఖ నుండి డాక్టర్ హనుమంతరావు ఆరోగ్య సేవలపై వివరాలు వెల్లడించారు. అనంతరం స్థానిక సీహెచ్‌సీ సూపరింటెండెంట్ కె. నాగేశ్వరరావు మాట్లాడుతుండగా పలువురు సర్పంచులు సమస్యలను ప్రస్తావించారు. ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించిన ఐదుగురు వైద్య సిబ్బంది విధుల్లో జవాబుదారీతనంతో వ్యవహరించి ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ముఖ్యంగా మహిళలకు అవసరమైన వైద్య సేవలు అందించేందుకు గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాగునీటి అంతరాయాలపై నిలదీత
మిషన్ భగీరథ ఏఈ చిరంజీవి మాట్లాడుతుండగా పలువురు సర్పంచులు తాగునీటి సరఫరాలో తరచూ అంతరాయాలు ఎందుకు ఏర్పడుతున్నాయని ప్రశ్నించారు. ప్రజలకు నిరంతరాయంగా తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఆర్డబ్ల్యూఎస్ అధికారి అరుణ వివిధ అంశాలపై వివరాలు వెల్లడించగా ముల్కనూర్ సర్పంచ్ వెంకట్రావు మాట్లాడుతూ చెరువులు, కుంటల శిఖం భూములు ఆక్రమణకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, చెరువుల్లో ఏర్పాటు చేసిన మోటార్లను తొలగించాలని కోరారు.బస్సులు, హాస్టళ్ల సమస్యలపై డిమాండ్లు మహబూబాబాద్, ఇల్లందు డిపోల నుంచి ఆర్టీసీ బస్సుల షటిల్ సర్వీసులను మండలం మీదుగా కొనసాగించాలని, స్థానిక ఇంటర్, డిగ్రీ కళాశాలల విద్యార్థులకు హాస్టల్ సదుపాయాలు కల్పించాలని, అవసరమైన చోట ప్రహరీ గోడలు నిర్మించాలని రామ్‌సింగ్ నాయక్ కోరారు. మండల విద్యుత్ శాఖ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మండల ప్రత్యేక అధికారి జి. దేశీరామ్ నాయక్ హామీ ఇచ్చారు. అధికారుల తీరుపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామ సభలకు సర్వసభ్య సమావేశాలకు గైర్హాజరయ్యే అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈసమావేశానికి మండల పరిధిలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు డీటీ శ్రీరామ్ నాయక్, వివిధ శాఖల అధికారులు హాజరు కాగా విద్యుత్ శాఖ ఏఈ మాత్రం గైర్హాజరయ్యారు.

