గార్ల, పెన్ పవర్, ఆగస్టు 20:
విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం వారి గొంతు నొక్కే ప్రయత్నం చేయడం సరికాదని ‘శక్తి’ స్కీమ్, జీవో 97ను వెంటనే రద్దు చేసి విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీటీసీ శీలంశెట్టి రమేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూపాలిటెక్నిక్ విద్యార్థులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థుల ఆందోళనలను అణచివేయడానికి పోలీసు బలాన్ని ఉపయోగించడం ప్రజాస్వామ్య పద్ధతి కాదని పేర్కొన్నారు.విద్యార్థులపై పోలీసులు కఠినంగా వ్యవహరించిన ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని, శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. విద్యార్థులపై దాడులకు పాల్పడిన పోలీసు అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అక్రమంగా నిర్బంధించిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని కోరారు.శక్తి’ స్కీమ్, జీవో–97 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థుల ఉన్నత విద్య, భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ప్రభావం పడుతుందన్న ఆందోళనలను ప్రభుత్వం సీరియస్‌గా పరిగణించాలని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడకుండా ప్రభుత్వం తక్షణమే వారితో చర్చలు జరిపి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థుల గొంతు నొక్కితే ప్రభుత్వ పతనం తప్పదని హెచ్చరించారు.

