గార్ల, పెన్ పవర్, ఆగస్టు1:
వర్షాకాలం నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రత్యేక అధికారి గుగులోతు దేశీరాం అన్నారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండల కేంద్రంలోని స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం విపత్తు నిర్వహణపై వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో పారిశుధ్య పనులు, ప్రజలకు రక్షిత మంచినీరు అందేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఎక్కడైనా పైప్‌లైన్ లీకేజీలు ఏర్పడితే వెంటనే సరిచేసుకోవాలన్నారు. మంచినీటి ట్యాంకులను శుభ్రం చేయించడంతోపాటు ఇండ్ల మధ్య వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. ఎక్కడైనా నీరు నిల్వ ఉంటే దోమలవ్యాప్తిని అరికట్టేందుకు ఆయిల్‌బాల్స్ వేయించాలని అన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల విషయంలో ప్రత్యేక దృష్టిని సారించాలన్నారు. వర్షాలతో విద్యుత్తు సరఫరాకు ఆటంకం కలుగకుండా పునరుద్ధరణ పనులను చేపట్టాలని.. విద్యుదా ఘాతాలు జరుగకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరదనీటి ప్రవాహానికి రహదారులు దెబ్బతినే అవకాశం ఉన్నందున ముందుగా గుర్తించి.. తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎక్కడ కూడా ప్రమాదాలు జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న చెరువులు, చెక్‌డ్యాంలు, కాల్వలు తెగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని గ్రామాలలో పాత ఇల్లు గోడలు, కూలే అవకాశం ఉన్న వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని వర్షాకాలం నేపథ్యంలో సమయానుకూలంగా స్పందించాలని అధికారులను ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో ఎంపీడీవో మంగమ్మ, తాసిల్దార్ శారద, మండల పంచాయతీ అధికారి శ్రీలక్ష్మి, వివిధ పంచాయతీ కార్యదర్శులు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

