వనరుల సమర్థ నిర్వహణకు ఆప్టిమైజేషన్ ఉపయుక్తం
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ విశాఖపట్నం, ఆగస్టు 13: వనరులను సమర్థవంతంగా వినియోగించడంతో పాటు ఆర్థిక, పర్యావరణ, సామాజిక లక్ష్యాలను సమన్వయం చేసేందుకు ఆప్టిమైజేషన్ కీలకంగా ఉపయోగపడుతుందని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ ఎమెరిటస్, ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి ప్రొఫెసర్ జి.పి. పాండురంగయ్య తెలిపారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల కెమికల్ ఇంజినీరింగ్ విభాగం సమావేశ మందిరంలో గురువారం “ఆప్టిమైజేషన్ మరియు మల్టీ-ఆబ్జెక్టివ్ ఆప్టిమైజేషన్” అంశంపై సాంకేతిక ఉపన్యాసం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ పాండురంగయ్య గణిత నమూనాలు, ఆబ్జెక్టివ్ ఫంక్షన్లు, ఆప్టిమల్ డిజైన్, ఆప్టిమైజేషన్ ప్రాథమిక అంశాలను వివరించారు.
ఏరోస్పేస్, ట్రాజెక్టరీ ఆప్టిమైజేషన్, కంట్రోల్ సిస్టమ్స్, డేటా అనాలిసిస్, మోడలింగ్, ఉత్పత్తి రూపకల్పన, సరఫరా గొలుసు నిర్వహణ వంటి రంగాల్లో ఆప్టిమైజేషన్‌కు ఉన్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. ముఖ్యంగా మల్టీ-ఆబ్జెక్టివ్ ఆప్టిమైజేషన్ ద్వారా పరస్పర విరుద్ధమైన బహుళ లక్ష్యాలను సమతుల్యం చేసుకోవచ్చని తెలిపారు.
సుస్థిర ఇంజినీరింగ్‌లో ఆర్థిక, పర్యావరణ, సామాజిక లక్ష్యాలను సమన్వయం చేయడంలో ఆప్టిమైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. క్లోజ్డ్-లూప్ సప్లై చైన్స్‌తో పాటు వ్యవసాయ, పండ్ల సరఫరా వ్యవస్థల్లో వనరుల సమర్థ వినియోగం, లాజిస్టిక్స్, పంపిణీ, సుస్థిర నిర్వహణకు ఇది ఎంతగానో దోహదపడుతుందని వివరించారు.
ఈ సాంకేతిక ఉపన్యాసం ద్వారా ఇంజినీరింగ్, పారిశ్రామిక నిర్ణయాల రూపకల్పన, సుస్థిరాభివృద్ధిలో ఆప్టిమైజేషన్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కలిగింది. కార్యక్రమంలో విభాగాధిపతి, పాలక మండలి సభ్యులు ఆచార్య టి. చిట్టిబాబు, విభాగ ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనంతరం ప్రొఫెసర్ జి.పి. పాండురంగయ్యను ఘనంగా సత్కరించారు.

