బాలల భద్రతపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి
హయత్‌నగర్‌లో ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ అవగాహన కార్యక్రమం
ఎల్బీనగర్, పెన్ పవర్ అక్టోబర్ 31:
బాలల రక్షణ, హక్కుల పరిరక్షణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఫాస్ట్ ట్రాక్ ప్రత్యేక న్యాయమూర్తి ఎం.కె. పద్మావతి సూచించారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మార్గదర్శకత్వంలో, తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో రంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హయత్‌నగర్‌లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ‘సురక్షిత్ బచ్పన్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన న్యాయమూర్తి ఎం.కె. పద్మావతి విద్యార్థులకు బాలల హక్కులు, బాలలపై లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టం (పోక్సో చట్టం–2012), బాలల భద్రతపై అవగాహన కల్పించారు. బాలల రక్షణలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కీలక పాత్ర పోషించాలని పేర్కొన్నారు. హయత్‌నగర్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగం గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్‌మోహన్ విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై వివరించారు. లైంగిక వేధింపులను గుర్తించడం, అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎవరికి ఫిర్యాదు చేయాలి, తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశాలను తెలియజేశారు. హయత్‌నగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ శంకరయ్య, సబ్‌ఇన్‌స్పెక్టర్ పోక్సో చట్టంపై అవగాహన కల్పించగా, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ప్రవీణ్ బాలల రక్షణ చట్టాలు, బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి, ఉపాధ్యాయులు, పారా లీగల్ వాలంటీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

