వ్యర్థాలతో దుర్గంధం.. చిరు వ్యాపారులకు తప్పని తిప్పలు
చీరాల, అక్టోబరు 8: చీరాల మున్సిపల్ పరిధిలోని మోహన్ థియేటర్ ఎదుట డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. మురుగు నీరు నిలిచిపోవడంతో పాటు డ్రైనేజీ వ్యర్థాలు బయటకు వచ్చి దుకాణాల ముందు పేరుకుపోతున్నాయి. దీంతో పరిసర ప్రాంతాల్లో దుర్గంధం వెదజల్లుతూ చిరు వ్యాపారులు, ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
డ్రైనేజీ నీటి పారుదల స్తంభించినా సమస్యను పట్టించుకునే వారు లేరంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి డ్రైనేజీని శుభ్రం చేసి మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని చిరు వ్యాపారి నారాయణ కోరారు. ఇప్పటికైనా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

