అండ్రంగిలో మంటలతో ఉలిక్కిపడ్డ రైతులు.. ధాన్య రాశులకు తృటిలో తప్పిన ముప్పు
కాజులూరు, పెన్ పవర్,మే 22: కాకినాడ జిల్లా కాజులూరు మండల పరిధిలోని అండ్రంగి గ్రామంలో వరి చేలల్లో గడ్డి, కంకులు తగలబెట్టడం వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుని గ్రామ రైతులను ఒక్కసారిగా భయాందోళనకు గురిచేసింది. మంటలు వేగంగా వ్యాపించి గడ్డి మేట్లు, చెట్లను అంటుకోవడంతో సమీపంలో ఉన్న ధాన్య రాశులకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.
వేసవి ఎండలు తీవ్రంగా ఉన్న సమయంలో కొందరు రైతులు నిర్లక్ష్యంగా చేలల్లో వరి కంకులు,గడ్డి తగలబెడుతుండటంతో ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. “మాకు పనైపోయింది.. మిగతావారి సంగతి మాకు అవసరం లేదు” అన్నట్టుగా కొందరు వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు మండిపడ్డారు.మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో సమీపంలోని ధాన్య రాశులు పెట్టిన రైతులు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వెంటనే రామచంద్రపురం అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించగా, హుటాహుటిన అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అండ్రంగి వీఆర్వో లోవమూర్తి తెలిపారు. దీంతో స్థానిక రైతులు, గ్రామ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
వ్యవసాయ అధికారులు వరి కంకులు, గడ్డి, పిచ్చి మొక్కలు దహనం చేయడం వల్ల నేల సారానికి ఉపయోగపడే అవశేషాలు, వానపాములు, పంచేంద్రియ జీవులు నాశనం అవుతాయని రైతులకు అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు రైతులు వాటిని పట్టించుకోవడం లేదని అధికారులు తెలిపారు. చేలల్లో మంటలు పెట్టడం వల్ల అగ్ని ప్రమాదాలతో పాటు పొగ కారణంగా రోడ్డు ప్రమాదాలు కూడా జరిగే అవకాశముందని హెచ్చరించారు.


ఇకపై మండలంలో ఎవరైనా నిర్లక్ష్యంగా పంట పొలాల్లో మంటలు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు హెచ్చరించారు. ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.

