పాండురంగస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి అనిత
బ్యూరో రిపోర్ట్ పెన్ పవర్ పాయకరావుపేట / అనకాపల్లి, జులై 25 : పాయకరావుపేటలోని ప్రసిద్ధ శ్రీ పాండురంగస్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై ట్రస్టు బోర్డు చైర్మన్తో పాటు సభ్యులకు ప్రమాణ స్వీకారం చేయించారు.
కార్యక్రమానికి ముందు లక్ష్మి థియేటర్ నుంచి శ్రీ పాండురంగస్వామి ఆలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్గమధ్యంలో స్థానికులు హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు.
అనంతరం హోంమంత్రి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, వేద పండితులు ఆశీర్వచనం అందజేశారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మజ్జూరి నారాయణరావు ట్రస్టు బోర్డు చైర్మన్గా, మరో 11 మంది సభ్యులు పాలక మండలి సభ్యులుగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ, వందేళ్ల చరిత్ర కలిగిన శ్రీ పాండురంగస్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం సమర్థులకు బాధ్యతలు అప్పగిస్తోందని, ఎన్నికల తర్వాత అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
పాయకరావుపేట నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని, ప్రధాన రహదారి పనులు త్వరలో పూర్తవుతాయని తెలిపారు. గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరుతున్న నేపథ్యంలో పాయకరావుపేటలో నిర్వహించే జలహారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరవుతారని వెల్లడించారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అత్యాధునికంగా నిర్మితమైందని, త్వరలో ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వేగంగా అభివృద్ధి చెందుతోందని, పరిశ్రమలు, దేవాలయాలు, పర్యాటక కేంద్రాలతో పాయకరావుపేటకు మరింత అభివృద్ధి అవకాశాలు ఉన్నాయని హోంమంత్రి అనిత తెలిపారు.

