Homeరాజకీయంఆదివాసీ సంస్కృతికి గౌరవం ఇవ్వాలి

ఆదివాసీ సంస్కృతికి గౌరవం ఇవ్వాలి

ధింసా మా సంస్కృతి.. వినోద వస్తువు కాదు

ఎఐఎఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడపల సోమేశ్‌కుమార్

గూడెం కొత్త వీధి,పెన్ పవర్,ఆగస్టు 3:ఆదివాసుల పవిత్ర సంప్రదాయమైన ధింసా నృత్యాన్ని విద్యార్థులతో వినోద ప్రదర్శనగా నిర్వహించడం ఆదివాసీ సంస్కృతిని అవమానించడమేనని ఆల్‌ ఇండియా ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి (ఎఐఎఎస్ఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు మడపల సోమేశ్‌కుమార్‌ అన్నారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్వాగతం పలికేందుకు సుమారు 13 వేల మంది గిరిజన బాలికలతో ధింసా నృత్య ప్రదర్శన నిర్వహించడాన్ని ఆయన ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.ధింసా నృత్యం కేవలం ఒక కళారూపం కాదని, అది ఆదివాసుల జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, విశ్వాసాలు, సామూహిక ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. అలాంటి పవిత్రమైన సంప్రదాయాన్ని దాని సాంస్కృతిక నేపథ్యం నుంచి వేరు చేసి భారీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వినోద ప్రదర్శనగా వినియోగించడం ఆదివాసీ సమాజ మనోభావాలను దెబ్బతీసే చర్యగా అభివర్ణించారు.

👉విద్యార్థులను విద్యకు దూరం చేశారని ఆరోపణ:

ప్రదర్శన కోసం గిరిజన విద్యార్థులను ముందుగానే సన్నద్ధం చేయడంతోపాటు, రెండు వారాలపాటు విద్యకు దూరంగా ఉంచి సాధన చేయించడం సరికాదని సోమేశ్‌కుమార్‌ అన్నారు. ఆదివాసీ సంస్కృతిని ప్రపంచ రికార్డు లేదా గిన్నిస్‌ బుక్‌ స్థాయిలో ప్రదర్శించామనే ప్రచారం కంటే, ఆ సంస్కృతికి తగిన గౌరవం కల్పించడమే ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని పేర్కొన్నారు.“ధింసా మా సంస్కృతి – వినోద వస్తువు కాదు. ఆదివాసీ ఆత్మగౌరవాన్ని గౌరవించండి” అని ఆయన అన్నారు. ఆదివాసుల సంప్రదాయ కళారూపాలు, ఆచారాలకు భంగం కలగకుండా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.ఈ ఘటనపై నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదివాసీ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని సోమేశ్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular