నర్సీపట్నం మున్సిపాలిటీలో ఘనంగా ‘ఇంటింటికి తెలుగుదేశం’..
భారీగా అభివృద్ధి పనులకు శ్రీకారం…
నర్సీపట్నం, పెన్ పవర్ :
నర్సీపట్నం పట్టణంలోని 25వ వార్డులో ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం శనివారం పండుగ వాతావరణంలో జరిగింది. వార్డు మహిళలు హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు చింతకాయల రాజేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సతీమణి పద్మావతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికీ తిరిగి గత రెండేళ్లలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. అలాగే స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మొత్తం రూ. 70 లక్షల 59 వేల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో రూ. 25 లక్షల 24 వేలతో పూర్తయిన 5 సీసీ రోడ్లు, కాలువలను ప్రారంభించడంతో పాటు, రూ. 45 లక్షల 35 వేలతో నూతనంగా నిర్మించనున్న పనులకు కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా చింతకాయల పద్మావతి మాట్లాడుతూ 25వ వార్డు ప్రజలు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని, వారు ఎల్లప్పుడూ తమపై చూపిస్తున్న ఆదరాభిమానాలు మరువలేనివని స్పష్టం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, స్పీకర్ అయ్యన్నపాత్రుడు సహకారంతో వార్డులో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని ఆమె తెలిపారు. రాజేష్‌ను కౌన్సిలర్‌గా ఆదరించి గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డులో మిగిలి ఉన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను రానున్న కాలంలో పూర్తిగా పరిష్కరిస్తామని, అభివృద్ధి పనుల విషయంలో నిధుల కొరత లేదని ఆమె హామీ ఇచ్చారు. అనంతరం చింతకాయల రాజేష్ మాట్లాడుతూ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కృషితో నర్సీపట్నం మున్సిపాలిటీకి రూ. 242 కోట్లు నిధులు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. అందులో సీసీ రోడ్లు, కాలువల కోసం రూ. 32 కోట్లు, చెత్త నిర్వహణ కోసం రూ. 3.5 కోట్లు వెచ్చించామన్నారు. పట్టణంలో 1050 పాత లైట్లను బాగుచేయడంతో పాటు, కొత్తగా 750 వీధి దీపాలు, 140 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు. ముఖ్యంగా పాత నర్సీపట్నం పరిధిలోని 25వ వార్డులో సరస్వతి ప్రెస్ రోడ్డు, తోటవారి సందులో నూతన రోడ్లు వేశామని, వినాయకుడి గుడి వెనుక నుండి ముత్యాలమ్మ జంక్షన్ వరకు రోడ్డు, కాలువ నిర్మాణానికి టెండర్లు పూర్తయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చానని, ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ గుడబండి ఆదిలక్ష్మి, ముఖ్య నాయకులు శ్రీ నూకంబిక ఆలయ కమిటీ చైర్మన్ కొరుప్రోలు శ్రీనివాసరావు, పెదిరెడ్ల కిరణ్, కుప్పిలి స్వామి 28వ వార్డు మహిళలు, యువకులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

