వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి తీవ్ర విషాదకరం
నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తాం: సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 9: రాజమండ్రిలో మద్యం మత్తులో తీవ్ర నిర్లక్ష్యంగా కారు నడిపి ఢీకొట్టిన ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి చెందడంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ఎంతో భవిష్యత్ ఉన్న వైద్య విద్యార్థిని ప్రియాంక ఇలా ప్రాణాలు కోల్పోవడం తనను కలిచివేసిందని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటన అత్యంత బాధాకరమన్నారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులు ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్నారని తెలిపారు.
తమ నిర్లక్ష్యంతో నిండు ప్రాణాన్ని బలిగొన్న నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని, నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట ప్రకారం శిక్ష పడేలా చూస్తామని తెలిపారు.
ప్రియాంక కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

